మంగళవారం 02 జూన్ 2020
National - Jan 17, 2020 , 03:40:04

భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం

భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కశ్మీర్‌ లోయలో భారీ ఉగ్రదాడి జరుపాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

  • ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన కశ్మీర్‌ పోలీసులు
  • మందుగుండు సామగ్రి స్వాధీనం
  • రిపబ్లిక్‌ డే సందర్భంగా దాడికి కుట్ర పన్నిన ముష్కరులు
  • మరో ఘటనలో కరుడుగట్టిన ఉగ్రవాది హరూన్‌ హతం

శ్రీనగర్‌/జమ్ము, జనవరి 16: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కశ్మీర్‌ లోయలో భారీ ఉగ్రదాడి జరుపాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ నెల 8న శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్‌ ప్రాంతానికి సమీపంలో జరిగిన గ్రెనేడ్‌ దాడి ఘటనలో దర్యాప్తు జరిపిన పోలీసులు తొలుత ఎజాజ్‌ అహ్మద్‌ షేక్‌, ఉమర్‌ హమీద్‌ షేక్‌లను అరెస్టు చేశారు. వీరిని విచారించగా దాడికి తామే పాల్పడ్డామని ఒప్పుకోవడమే కాకుండా గతేడాది నవంబర్‌ 26న కశ్మీర్‌ యూనివర్సిటీ సమీపంలో కూడా దాడికి పాల్పడ్డామని చెప్పారు.


దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంతియాజ్‌ అహ్మద్‌ చిక్లా, సాహిల్‌ ఫరూఖ్‌ జోగ్రి, నజీర్‌ అహ్మద్‌ మీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగానే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ దాడి చేయాలన్న ఉగ్రవాదుల కుట్ర బయటపడింది. ఉగ్రవాదులు వెల్లడించిన సమాచారం మేరకు సోదాలు జరిపిన పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పేలుడు పదార్థాలు, తుపాకులు, డిటోనేటర్లు, జెలటిన్‌ స్టిక్స్‌, పేలుడు పదార్థాలు గల జాకెట్లు, బ్యాటరీలు, నైట్రిక్‌ యాసిడ్‌ ఉన్నాయి. పోలీసులు మాట్లాడుతూ ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేయడం గొప్ప విజయమని చెప్పారు. కశ్మీర్‌లో సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేయడం, బంద్‌లు జరుగడంలోనూ వీరి పాత్ర ఉన్నదని పేర్కొన్నారు.


 ఎంబీఏ చదివి.. ఉగ్రవాద సంస్థలో చేరి..

హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక వ్యక్తి హరూన్‌ అబ్బాస్‌ వనీని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుధవారం కశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు హతమయ్యాడు. దోడా జిల్లాకు చెందిన హరూన్‌పై నాలుగు హత్య కేసులు, రెండు ఆయుధాల దొంగతనం కేసులు ఉన్నాయి. ఎంబీఏ చదివిన అతడు 2018లో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడు. అప్పట్లో ఏకే-47 తుపాకీతో అతడు దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అతడిపై దృష్టిసారించారు.


గతేడాది కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా హతమైనప్పటి నుంచి చినాబ్‌ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను హరూన్‌ పర్యవేక్షిస్తున్నాడు. జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ఒసామా హతమైనప్పటి నుంచి హరూన్‌ ఉగ్రవాద కార్యకలాపాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. అతనిని పట్టుకోవడానికి నిఘా ఉంచాం. బుధవారం తన సహచరులతో దోడా జిల్లాలోని గోందానా బెల్ట్‌లో సంచరిస్తున్నట్లు సమాచారం ఉండటంతో గాలింపు చేపట్టాం. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో హరూన్‌ హతమయ్యాడు’ అని తెలిపారు. హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ హోదాలో హరూన్‌ పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. తప్పించుకున్న మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామన్నారు.


logo