సోమవారం 18 జనవరి 2021
National - Jan 07, 2021 , 21:15:28

ఆ 4 రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం

ఆ 4 రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం

న్యూఢిల్లీ: తాజాగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. దేశంలోని 59 శాతం యాక్టివ్‌ కేసుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ గురువారం తెలిపారు. నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మ్యూటేటెడ్‌ స్ట్రైన్‌ ఆఫ్‌ వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా నమూనా పరీక్షలను తగ్గించవద్దని హెచ్చరించారు.

ఇతర రాష్ట్రాలు రూపొందించిన ‘టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌’ విధానాన్ని దూకుడుగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ఫేస్‌మాస్క్‌లు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని, ఇతర కొవిడ్‌ మార్గదర్శకాలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. 

పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనాపై పోరు కొనసాగించాల్సిందేనని కేరళ, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ హెచ్చరించారు. కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటించడం మరిచిపోవద్దని పేర్కొన్నారు. 

మహారాష్ట్రలో సుమారు 52వేల యాక్టివ్‌ కేసులు ఉండగా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లలో సుమారు 9వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేరళలో గత వారం రోజులుగా 5వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 3700, చత్తీస్‌గఢ్‌లో సగటున 1106, పశ్చిమ బెంగాల్‌లో 908 కొత్త కేసులు రికార్డవుతున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.