e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home Top Slides బ్యూరోక్రసీలో భారీ ప్రక్షాళన

బ్యూరోక్రసీలో భారీ ప్రక్షాళన

బ్యూరోక్రసీలో భారీ ప్రక్షాళన
  • పెద్దఎత్తున చేపడుతున్న కేంద్రం
  • మోదీ పాలనలో మరింత వేగం
  • అవినీతి నిర్మూలనే ప్రధాన లక్ష్యం
  • ఆరేండ్లలో 400 మంది ఊస్టింగ్‌
  • మరో 284 మంది సీసీఎస్‌లూ..
  • అవినీతిపరులు ఇక ఇండ్లకే
  • అసమర్థ అధికార్లకూ అదేదారి
  • బాబూస్‌కు కొలువుల భయం!

న్యూఢిల్లీ, మార్చి 28: దేశంలోని అత్యున్నత ఉద్యోగస్వామ్యంలో భారీ ప్రక్షాళన జరుగుతున్నది. బ్యూరోక్రసీగా పిలిచే ఈ వ్యవస్థలో అవినీతి, అసమర్థత నిర్మూలనపై కేంద్రప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. అవినీతిపరులు, అసమర్థులుగా తేలిన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ తదితర సివిల్‌ సర్వీస్‌ అధికారులను ప్రభుత్వం ఇండ్లకు సాగనంపుతున్నది. ఈ విధానం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపందుకొన్నది. ఇప్పటివరకు దాదాపు 400 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ తదితర సివిల్‌ సర్వీస్‌ క్యాడర్‌ అధికారులను ఉద్యోగాలనుంచి తొలగించటం లేదంటే బలవంతంగా పదవీ విరమణ చేయించటం జరిగింది. మరోవైపు వివిధ శాఖల్లో కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ప్రైవేటు వ్యక్తులను తీసుకొనేందుకు లేటరల్‌ ఎంట్రీ విధానాన్ని అమల్లోకి తేవటంతో గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా మనదేశ బ్యూరోక్రసీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. దీని ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కఠినంగానే వ్యవహరిస్తున్నది.

‘బాబు’లకు బంతాటే..
దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగులు సివిల్‌ సర్వెంట్లే. ప్రభుత్వానికి కండ్లు, చెవులుగా పనిచేసేది వీరే. విధాన నిర్ణయాల్లోనూ, వాటి అమలులోనూ వీరే కీలకపాత్ర పోషిస్తారు. అయితే, ఈ అత్యున్నత ఉద్యోగస్వామ్యంలో దశాబ్దాలుగా అవినీతి పేరుకుపోయిందని, కొందరు అధికారులకు ఆ ఉద్యోగాల్లో కొనసాగే శక్తిసామర్థ్యాలు లేవనే విమర్శలు ఉన్నాయి. నరేంద్రమోదీ తొలిసారి ప్రధాని పదవిచేపట్టిన తర్వాత బ్యూరోక్రసీలో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపుతానని ప్రకటించారు. ‘బాబు’ల పాలనకు ఇంకెంతమాత్రం స్థానంలేదని తేల్చేశారు. చెప్పినట్టుగానే ప్రభుత్వం 2017లో 24 మంది ఐఏఎస్‌ అధికారులుసహా 381 మందిని వివిధ కారణాలతో ముందస్తు పదవీ విరమణ చేయించింది. 2019లో కేంద్ర సచివాలయ సర్వీస్‌ (సీఎస్‌ఎస్‌)లో 284 మందిని ఇలాగే ఇండ్లకు పంపింది. అదే ఏడాది అవినీతి, లైంగికవేధింపుల ఆరోపణలున్న 50 మంది ఐఆర్‌ఎస్‌ అధికారులను ముందస్తు పదవీ విరమణ చేయాలని ఆదేశించి అమలుచేసింది. ఉద్యోగాలకు సరిపోయే శక్తిసామర్థ్యాలు లేవన్న కారణంతో ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను తక్షణం పదవీ విరమణ చేయాలని ఈ నెల 17న కేంద్ర హోంశాఖ ఆదేశించింది. 2014-19 మధ్య అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై న్యాయవిచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ప్రభుత్వంచేతిలో పాశుపతాస్త్రం..ఎఫ్‌ఆర్‌ 56(జే)
అవినీతిపరులు, అసమర్థ అధికారులను ఉద్యోగాలనుంచి తప్పించేందుకు ప్రభుత్వం ఫండమెంటల్‌ రూల్స్‌ (ఎఫ్‌ఆర్‌), కండక్ట్‌ రూల్స్‌, క్లాసిఫికేషన్‌, కంట్రోల్‌, అప్పీల్‌ (సీసీఏ)లను వాడుతున్నది. ముఖ్యంగా ఎఫ్‌ఆర్‌ 56 (జే) రూల్‌ ప్రభుత్వానికి పాశుపతాస్త్రంగా మారింది. ఈ నియమం ప్రకారం అత్యున్నత స్థాయి అధికారుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటునవారు, సరైన శక్తిసామర్థ్యాలు చూపలేకపోయినవారిని ప్రజా సంక్షేమం దృష్ట్యా ఉద్యోగాలనుంచి తొలగించవచ్చు. అయితే, వారి సర్వీస్‌ 30 ఏండ్లు పూర్తై ఉండాలి. లేదంటే 50-55 ఏండ్ల వయసువారై ఉండాలి. వారికి మూడునెలల ముందుగా నోటీస్‌ ఇచ్చి సర్వీసు ముగియకుండానే పదవీ విరమణ చేయాలని ఆదేశించవచ్చు. కొన్నిసందర్భాల్లో నేరుగా ఉద్యోగాలనుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. ఇలా పదవీ విరమణ చేసినవారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ లభిస్తాయి.

ప్రయోజనం కనపడుతున్నదా?
ప్రభుత్వ నిర్ణయంపై రిటైర్డ్‌ ఉన్నతాధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకోవటం మంచిదే. కానీ ప్రభుత్వ ఉద్దేశంపైనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలవల్ల ప్రజల దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిపరులే కాకుండా చేతగానివాళ్లు కూడా అన్న భావన ఏర్పడుతుంది’ అని కేంద్ర క్యాబినెట్‌ మాజీ కార్యదర్శి అనిల్‌ స్వరూప్‌ అభిప్రాయపడ్డారు. ‘అత్యున్నత విధాన నిర్ణాయక ఉద్యోగస్వామ్యంలో అవినీతి, చేతగానితనం ఉన్నాయన్నది నిజం. ముఖ్యంగా ఉన్నతస్థానంలోకంటే మధ్యస్థాయి అధికారగణంలో ఇది మరింత ఎక్కువగా ఉన్నది’ అని మాజీ ఐఏఎస్‌ అధికారి అమితాబ్‌ భట్టాచార్య అన్నారు.

ఇవీ కూడా చదవండి..

సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్‌

మీ ఫేస్‌బుక్ ఖాతా సుర‌క్షిత‌మేనా? మీ ప్రొఫైల్‌ని ఇలా సేఫ్‌గా మార్చుకోండి

బిట్ కాయిన్ అభివృద్ధికి ట్విట్ట‌ర్ ఫండ్‌.. ఎందుకంటే?!

గ్రామాన్నంతా తెల్ల‌దుప్ప‌టిలా క‌ప్పేసిన మంచు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్యూరోక్రసీలో భారీ ప్రక్షాళన

ట్రెండింగ్‌

Advertisement