శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 02:48:28

8 నెలల గర్భిణి..అసెంబ్లీకి హాజరు

8 నెలల గర్భిణి..అసెంబ్లీకి హాజరు
  • మహారాష్ట్ర మహిళా ఎమ్మెల్యే ఆదర్శం

ముంబై: ఆమె ఎమ్మెల్యే.. ఎనిమిది నెలల గర్భవతి.. కానీ విధులకు హాజరు కావడానికి అదేమీ ఆమెకు ఆటంకం కాలేదు.. ఆమె పేరు నమిత మందాడ (30).. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలోని కెజ్‌ ఎస్సీ రిజర్వుడ్‌ అసెంబ్లీ స్థానానికి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆమె శుక్రవారం హాజరయ్యారు. తద్వారా గర్భవతిగా ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. దీనిపై నమిత స్పందిస్తూ.. ‘ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరు కావడం నా విధి.. బాధ్యత. నా నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. వాటిని సభలో నేను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు బీడ్‌ జిల్లా ఆడ శిశువుల అబార్షన్లకు పెట్టింది పేరు. కానీ ప్రస్తుతం నమిత మందాడ వంటి ధైర్యవంతురాలైన మహిళ ఈ జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 


logo