శనివారం 06 మార్చి 2021
National - Jan 22, 2021 , 10:27:44

సీఎం పదవి ప్రతి నాయకుడి కల.. నేనూ అంతే

సీఎం పదవి ప్రతి నాయకుడి కల.. నేనూ అంతే

ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ ముఖ్యమంత్రి పీఠంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నానని చెప్పారు. ప్రతి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కలకంటాడు. తానూ అంతే. తనలా ఎక్కువకాలం రాజకీయాల్లో ఉన్నవారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకోవడం తప్పుకాదని, తనకూ అలాంటి కోరిక ఉండటం సహజమేనని చెప్పారు.

అయితే తమ పార్టీకి 54 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, సీఎం కావాలంటే ఆ సంఖ్య సరిపోదని చెప్పారు. భవిష్యత్‌లో తమ పార్టీ సొంతంగా అధికారం చేపట్టే స్థాయికి చేరుతుందని, అప్పుడు పార్టీ అధినేత శరద్‌పవార్‌ సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని నిర్ణయిస్తారని వెల్లడించారు. సాంగ్లీలో స్థానిక మీడియాతో మాట్లాడిన ఆయన.. పాటిల్‌ సీఎం కావాలనుకుంటున్నారా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానం ఇచ్చారు.  

‘అవును నేను సీఎం కావాలని కోరుకుంటున్నాను. ప్రతి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. అయితే పార్టీనాయకుడు శరద్‌ పవార్‌ నిర్ణయమే తమకు ఫైనల్‌. తనలా ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగిన ప్రతి ఒక్కరు సీఎం కావాలనుకుంటారు. నా ఓటర్లు కూడా అదే కోరుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కూడా ఉండాలి కదా. తమకు 54 మంది మాత్రమే ఉన్నారు. ఈ 54 మందితో సీఎం సాధ్యమవుతుందని తాను అనుకోవడం లేదు. తాము తొందర్లోనే ఆ స్థాయికి చేరుకుంటాం’ అని చెప్పారు. 

కాగా, ఇదే విషయాన్ని ఉపముఖ్యమంత్రి అజిత్‌ పాటిల్‌ వద్ద ప్రస్తావించగా ఆయన కోరుకున్నదానికి తాను మద్దతునిస్తానని చెప్పడం ఇక్కడ కొసమెరుపు.

VIDEOS

logo