శనివారం 23 జనవరి 2021
National - Jan 13, 2021 , 13:13:34

డ‌బ్బులు గుంజేందుకే అత్యాచారం డ్రామా: మ‌హారాష్ట్ర మంత్రి

డ‌బ్బులు గుంజేందుకే అత్యాచారం డ్రామా: మ‌హారాష్ట్ర మంత్రి

ముంబై: మహారాష్ట్ర సోషల్‌ అండ్‌ జస్టిస్‌ మినిస్టర్ ధనుంజ‌య్‌ ముండే త‌నపై వ‌చ్చిన అత్యాచార ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేశారు. ఇద్ద‌రం ఇష్ట‌‌పూర్వ‌కంగానే 2003 నుంచి రిలేష‌న్ షిప్‌లో ఉన్నామ‌ని, త‌మ‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నార‌ని‌ ధ‌నుంజ‌య్ ముండే చెప్పారు. ఈ విష‌యం ఇప్ప‌టికే త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా తెలియ‌జేశాన‌ని, వారు కూడా అంగీక‌రించార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అంతా బాగుంద‌నుకున్న స‌మ‌యంలో త‌న‌పై అత్యాచార ఆరోపణ‌లు చేస్తున్నార‌ని, కేవ‌లం డ‌బ్బు గుంజాల‌న్న‌ ఆశ‌తోనే స‌ద‌రు మ‌హిళ, ఆమె సోద‌రితో క‌లిసి నాట‌కం ఆడుతున్న‌ద‌ని ధ‌నుంజ‌య్ విమ‌ర్శించారు. 

ఆ ఇద్దరి మీద తాను గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని ధ‌నుంజ‌య్ ముండే చెప్పారు. కాగా, మ‌హిళ‌తో సంబంధం ఉందని ధ‌నుంజ‌య్ ముండే ఒప్పుకున్న నేప‌థ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైంది. ధ‌నుంజ‌య్‌ని వెంట‌నే ప‌ద‌వి నుంచి తొల‌గించాలంటూ మ‌హారాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్  చైర్‌పర్సన్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. 

కాగా, ధనుంజయ్‌ ముండే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏండ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఒడిశాలోని అంధేరి పోలీస్‌ స్టేషన్‌లో ఓ 38 ఏండ్ల మ‌హిళ‌ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె తరపు లాయర్‌ మాట్లాడుతూ.. బాధితురాలికి 1997 నుంచి ధనుంజయ్‌ ముండేతో పరిచయం ఉందన్నారు. తొలుత బాలీవుడ్‌లో సింగర్‌గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెతో పరిచయం పెంచుకున్నాడ‌ని, ఆ త‌ర్వాత ఆమెను లోబ‌ర్చుకున్నాడ‌ని ఆయ‌న‌ తెలిపారు. 

ధనుంజ‌య్ ముండే తొలిసారి 2008లో త‌న క్లయింట్‌పై అత్యాచారం చేశాడ‌ని ఆమె త‌ర‌ఫు లాయ‌ర్ వెల్ల‌డించారు. ఆ తర్వాత ఏళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడ‌ని, 2019లో ఆమె వివాహం చేసుకోవాల‌ని ఒత్తిడి తేగా ధ‌నుంజ‌య్‌ అంగీక‌రించ‌లేద‌ని చెప్పారు. అంతేకాక ఇద్ద‌రి మ‌ధ్య సంబంధం గురించి ఎవరికైనా చెబితే బాధితురాలి న‌గ్న‌ వీడియోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడ‌ని తెలిపారు. 

ఈ నేప‌థ్యంలోనే బాధ‌తురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింద‌న్నారు. కానీ, పోలీసులు ఇప్ప‌టికీ ధనుంజయ్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయలేదని, అందువ‌ల్ల తాము కోర్టుకు వెళ్తామ‌ని చెప్పారు. బాధితురాలికి ఏదైనా జరిగితే అందుకు ధనుంజయ్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo