సోమవారం 18 జనవరి 2021
National - Dec 20, 2020 , 18:19:24

శునకానికి సీమంతం చేసిన మరాఠా దంపతులు

శునకానికి సీమంతం చేసిన మరాఠా దంపతులు

ముంబై : తమ కుటుంబంలో సభ్యుడిగా ఉన్న కుక్కకు సీమంతం చేసి.. జంతువుల పట్ల తమ మంచి మనుసు చాటుకున్నారు మహారాష్ట్రకు చెందిన ఓ జంట. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న లక్కీ  అనే శునకం గర్భం దాల్చడంతో మనుషులకు మల్లే శునకానికి కూడా వైభవంగా సీమంతం జరిపించారు. యజమాని ఇంటిపేరు కులకర్ణి కావడంతో లక్కీ రాహుల్ కులకర్ణి అని ఈ శునకాన్ని పిలుస్తారు. ఈ జంట గురించి యూట్యూబర్ షైలా టేక్ ఈ విషయాన్ని చెప్పడంతో పలువురు ఈ జంటను అభినందిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు.


తమ ప్రియమైన కుమార్తె లక్కీ త్వరలో తల్లి కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని ఆ జంట తెలిపింది. లక్కీ సీమంతం వేడుకకు బంధువులు, స్నేహితులను కూడా ఆహ్వానించారు. లక్కీని సాంప్రదాయ మహారాష్ట్ర దుస్తులను ధరింపజేసి.. పూలతో అందంగా అలంకరించిన ఊయలలో కూర్చోబెట్టి సీమంతం జరిపి దిష్టి తీశారు. వచ్చిన  బంధువులు, స్నేహితులు కూడా లక్కీని దీవించి దానికి ఇష్టమైన ఆహారాన్ని అందించారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శునకం పట్ల ఇంత ఆప్యాయత, ప్రేమను ప్రదర్శిస్తున్న జంటను ప్రశంసల్లో ముంచెత్తారు. మనుషుల మాదిరిగా తల్లి కాబోతున్న కుక్కను కూడా గౌరవించడం వారి సాంప్రదాయానికి నిదర్శనమని పలువురు కామెంట్లు పోస్ట్‌ చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.