శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 16:48:05

మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం

మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 59 ఏండ్ల థాక్రే తొలిసారిగా శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు మరో ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మహారాష్ట్ర శాసన మండలిలో ఏప్రిల్‌ 24న తొమ్మిది మంది సభ్యుల పదవీకాలం ముగిసింది. దీంతో వీటి భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయగా, తొమ్మిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియడంతో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు ప్రకటించారు.

ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. గతేడాది నవంబర్‌ 28న ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ఇంతవరకు ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. అందువల్ల ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో, మే 27 లోపు ఆయన ఏదో సభకు సభ్యునిగా ఎన్నికవ్వాల్సి ఉన్నది.


logo