శనివారం 28 మార్చి 2020
National - Feb 22, 2020 , 02:16:06

సీఏఏపై భయం అక్కర్లేదు

సీఏఏపై భయం అక్కర్లేదు
  • ఎన్పీఆర్‌తో ఎవరినీ దేశం నుంచి వెళ్లగొట్టరు
  • ప్రధానితో భేటీ అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌) ద్వారా ఎవరినీ దేశం నుంచి పంపివేయరని చెప్పారు. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రధానిని కలువడం ఇదే తొలిసారి. ఎన్డీయేలో మాజీ భాగస్వామ్యపక్షమైన శివసేన.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో విడిపోయి.. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ‘మహారాష్ట్రకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించాను. అలాగే సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌పైనా చర్చలు జరిగాయి. ఎన్పీఆర్‌ ద్వారా దేశం నుంచి ఏ ఒక్కరినీ వెళ్లగొట్టరు’ అని ఉద్ధవ్‌ పేర్కొన్నారు. మహా కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, తమ ప్రభుత్వం ఐదేండ్లపాటు కొనసాగుతుందని చెప్పారు. సీఏఏ, ఎన్పీఆర్‌ విషయంలో ఉద్ధవ్‌ వైఖరిపై కాంగ్రెస్‌, ఎన్సీపీ ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, మహారాష్ట్ర సర్కారుకు అన్నివిధాలా సహకరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని ఉద్ధవ్‌ తెలిపారు.  


logo