ఆదివారం 12 జూలై 2020
National - Jun 22, 2020 , 15:35:23

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ‘మిషన్‌ జీరో’

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ‘మిషన్‌ జీరో’

ముంబై: మహారాష్ట్రను కొవిడ్‌-19 అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎక్కువ జనాభా ఉన్న ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముంబైలోని షాహాజీ రాజే భోసలే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ‘మిషన్‌ జీరో’ అనే పేరుతో సోమవారం ఒక ర్యాపిడ్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. 

ఇందులో భాగంగా ముంబైలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో 50 మొబైల్‌ డిస్పెన్సరీ వాహనాలను రెండు, మూడు వారాలపాటు తిప్పుతారు. ఆయా వార్డుల్లోని రోగులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మొదట ప్రభావం ఎక్కువ ఉన్న ములుంద్‌, భందుప్, అంధేరి, మాలద్‌, బోరివలి, దహిసర్‌, కండివలిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బీఎంసీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాకరే ఈ కార్యక్రమానికి ‘చేస్‌ ద వైరస్‌’ అని నామకరణం చేశారు. బీఎంసీకి మేయర్‌ కిశోరీ పడ్నేకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చాహల్‌, ఎమ్మెల్యే అస్లాం షేక్‌తో కలిసి తాను తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఠాకరే ట్వీట్‌ చేశారు. కాగా, ఆదివారం వరకు ముంబైలో 66,507 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు బీఎంసీ పేర్కొంది. logo