ఆదివారం 24 జనవరి 2021
National - Nov 27, 2020 , 01:30:36

మహారాజా మర్డర్‌

మహారాజా మర్డర్‌

  • ఎయిర్‌ ఇండియాకు పాడె కట్టిన కేంద్ర సర్కారు
  • మతిలేని నిర్ణయాలతో విమానయాన సంస్థ కుదేలు..
  • వీవీఐపీల ప్రయాణాల బకాయిలే 1,371 కోట్లు
  • విమానాల అద్దెల కోసం అప్పులు చేస్తున్న సంస్థ..
  • నష్టాల్లో ఉందంటూ సర్కారు వదిలించుకొనే ప్రయత్నం
  • ప్రమాదపుటంచుల్లో వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు
  • రిజర్వేషన్‌ ఉద్యోగులకు మరణశాసనమేనంటున్న సంఘాలు

న్యూఢిల్లీ, నవంబర్‌ 26: భారతీయులకు విమాన ప్రయాణాన్ని పరిచయం చేసిన సంస్థ అది.. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సంస్థ అది.. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక సిబ్బంది దాని సొంతం. భూమిపై అతిపెద్ద విమాన నెట్‌వర్క్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన సంస్థ.. అదే ఎయిర్‌ ఇండియా.. గతమెంతో ఘనకీర్తి కలిగిన ఈ సంస్థ.. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలతో నేడు  కుదేలైంది. కష్టాల్లో ఉన్న ప్రజలను.. నష్టాల్లో ఉన్న సంస్థలను ఆదుకొని నిలబెట్టాల్సిన ప్రభుత్వం మాత్రం ఆ సంస్థను వదిలించుకొని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించింది. దేశ నిర్మాణంలో కీలకభూమికి పోషించిన ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుకు ధారాదత్తం చేయటమే పనిగా పెట్టుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఈ ‘మహారాజా’ను కూడా తెగనమ్మేందుకు ప్రయత్నిస్తున్నది. 

సర్కారు నిర్ణయాలే శాపం

ఎయిర్‌ ఇండియాకు ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరులున్నాయి. ప్రపంచస్థాయి నాణ్యతగల సాంకేతిక సిబ్బంది ఈ సంస్థ సొంతం. అత్యంత అనుభవజ్ఞులైన పైలట్లు ఎయిర్‌ ఇండియాకు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పౌర వైమానిక నెట్‌వర్క్‌లలో ఎయిర్‌ ఇండియా ఒకటి. అయినా.. ఆ సంస్థ అప్పులపాలైంది. ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు, విమానాలకు అద్దెలు చెల్లించేందుకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖరీదైన విమానాలకు అద్దెలు బకాయి లు పడటంతో.. వాటిని చెల్లించేందుకు రూ.6,150 కోట్లు సేకరించేందుకు ఇటీవలే బ్యాంకుల గడప తొక్కింది. దీనికంతటికీ కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో బీజేపీ, గతంలో పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణమని ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సరైన వ్యాపా ర విధానం లేకపోవటం, ప్రభుత్వ అతి నియంత్రణ వల్లనే సంస్థ నష్టాలబాట పట్టిందని విమర్శిస్తున్నారు. అవసరంలేని డాంబికాలకుపోయి ప్రభుత్వం.. ఎయిర్‌ ఇండియాకు ఖరీదైన విమానాలను కట్టబెట్టడం కూడా సంస్థ తీవ్రంగా దెబ్బతినటానికి ఒక కారణమని ఆర్థికవేత్తలు అంటున్నారు. ‘మామూలు ట్యాక్సీ నడుపుకొనే వ్యక్తికి.. అది పాతబడిందన్న కారణంతో మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును ఇచ్చి ట్యాక్సీగా నడుపుకొమ్మని ఇస్తే ఏమవుతుంది? ఖరీదైన ఆ కారు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పోనీ వ్యాపారమైనా భారీగా పెరుగుతుందా అంటే అదీ ఉండదు. బెంజ్‌ ట్యాక్సీలో వెళ్లాలని అందరికీ ఉన్నా.. చార్జీల మోత అధికంగా ఉంటుంది కాబట్టి చాలామంది వెళ్లరు. దాంతో వ్యాపారమే కుంటుపడుతుంది’. ఎయిర్‌ ఇండియా పరిస్థితి కూడా కొంతవరకు ఇలాగే అయ్యిందని అంటున్నారు.    

అందరికీ మహారాజా సేవలే..

ప్రధాని పర్యటనలకు ఎయిర్‌ ఇండియా విమానాలు కావాలి.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి టూర్లకూ ఈ సంస్థే కావాలి. మం త్రులు.. ఎంపీలు.. చివరకు ప్రభుత్వ అధికారులకూ ఈ సంస్థే కావాలి. ఏదైనా విపత్తు వస్తే విదేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తరలించటానికీ ప్రభుత్వానికి ఎయిర్‌ ఇండియానే గుర్తుకొస్తుంది. కానీ సంస్థ సంక్షేమం మాత్రం ఎవరికీ అవసరం లేకుండా పోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే సంస్థకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వీవీఐపీల ప్రయాణ చార్జీల బకాయిలు ఏకంగా రూ.1,371 కోట్లు ఉన్నాయి. 

ఎయిర్‌ ఇండియా

ప్రారంభం: 15, అక్టోబర్‌ 1932

వ్యవస్థాపకుడు: జేఆర్‌డీ టాటా

ప్రభుత్వ స్వాధీనం: 1952

అనుబంధ సంస్థలు: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, అలయెన్స్‌ ఎయిర్‌, ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీసెస్‌

ఉద్యోగులు: 9,990

విమానాలు: 127

అప్పులు: రూ.60 వేల కోట్లు

ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి? 

ఎయిర్‌ ఇండియాలో దాదాపు పదివేల మంది ఉద్యోగులున్నారు. సంస్థను ప్రైవేటీకరిస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌ ఇండియాను ఏదైనా ప్రైవేటు సంస్థ కొనుగోలు చేస్తే ఇంతమందిని కొనసాగించే పరిస్థితి ఉండదు. వారి అవసరాలను బట్టి కొద్ది మందిని మాత్రమే కొనసాగిస్తారు. అలాంటప్పుడు మిగతావారి పరిస్థితి ఏమిటి? అని నిలదీస్తున్నారు. ఎంతోకాలంగా సంస్థలో సేవలు అందిస్తున్న తమను రోడ్డున పడేస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌ ఇండియాలో రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన రిజర్వేషన్ల ద్వారా చాలామంది ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు సంస్థను ప్రైవేటీకరిస్తే వీరిని తీసేసే పరిస్థితి ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కొత్త ఉద్యోగుల కల్పనపై కనీసం దృష్టిపెట్టని మోదీ సర్కారు.. ఉన్న ఉద్యోగాలను కూడా పీకేసే నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపిస్తున్నారు. సంస్థను ప్రైవేటీకరించే బదులు పూర్తిగా స్వయంప్రతిపత్తి కల్పించి స్వతంత్రంగా పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 

నాలుగేండ్ల క్రితమే..

ఎయిర్‌ ఇండియాను ప్రైవేట్‌ పరం చేయాలని నరేంద్రమోదీ సర్కారు నాలుగేండ్ల క్రితమే నిర్ణయించింది. తొలి దశలో సంస్థ లో 76 శాతం వాటా విక్రయించాలని నిర్ణయించి.. తర్వాత ఏకంగా 100 శాతం వాటాను విక్రయానికి పెట్టింది. కానీ సంస్థ ను కొనుగోలు చేయడానికి ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదు. నిజానికి సంస్థ ను ఆదుకొనేందుకు 2014కు ముందు అప్పటి మన్మోహన్‌ సర్కారు రూ.30 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కానీ అప్పుడు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో యూపీఏ ఓడిపోవటంతో అది అమలు కాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ప్యాకేజీ ప్రతిపాదనను అటకెక్కించి.. సంస్థను అడ్డికి పావుశేరు లెక్కన అమ్మేయాలని నిర్ణయించింది.  logo