ఆదివారం 12 జూలై 2020
National - Jun 23, 2020 , 02:28:42

మరణశిక్ష నుంచి నిర్దోషిగా..

మరణశిక్ష నుంచి నిర్దోషిగా..

  • పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడిని 
  • నిర్దోషిగా తేల్చిన మద్రాస్‌ హైకోర్టు 

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని తిరుపూర్‌ ‘పరువు హత్య’ కేసులో ప్రధాన నిందితుడిని మద్రాస్‌ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మిగతా ఐదుగురు నిందితులకు విధించిన మరణశిక్షను 25 ఏండ్ల యావజ్జీవ శిక్షగా మార్చింది. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా దళిత సామాజికవర్గానికి చెందిన శంకర్‌ను కౌసల్య అనే యువతి 2016లో పెండ్లాడింది. ఈ పెండ్లిని తొలినుంచీ వ్యతిరేకించిన కౌసల్య కుటుంబం.. శంకర్‌ను అంతమొందించటానికి కుట్ర పన్నింది. 2016 మార్చి 13న తిరుపూర్‌ జిల్లా ఉడుములపేటలో ముగ్గురు వ్యక్తులు శంకర్‌ను నడిరోడ్డుపై కౌసల్య ముందే దారుణంగా చంపారు. దాడిలో ఆమెకూ గాయలయ్యాయి. ఈ కేసులో ఆమె తండ్రి చిన్నస్వామి, మరో ఐదుగురికి తిరుపూర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు 2017 డిసెంబర్‌ 12న మరణశిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా.. తాజా తీర్పు వెలువడింది. కౌసల్య తల్లిని కూడా నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తానని, తన తల్లిదండ్రులకు శిక్ష పడే వరకూ విశ్రమించనని కౌసల్య పేర్కొన్నారు.


logo