మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 00:25:06

తొలి మూగ, చెవిటి సర్పంచ్‌!

తొలి మూగ, చెవిటి సర్పంచ్‌!
  • రికార్డులకెక్కనున్న మధ్యప్రదేశ్‌లోని ధనసరి గ్రామ నివాసి లాలు

ఇండోర్‌, ఫిబ్రవరి 9: ధనసరి.. మధ్యప్రదేశ్‌లోని వేయి మంది జనాభా ఉన్న ఓ గ్రామం. ఈ గ్రామ సర్పంచ్‌ పదవిని గిరిజనులకు రిజర్వ్‌చేశారు. అయితే అక్కడ ఉన్నది ఒకే ఒక్క గిరిజన ఓటర్‌. పంచాయతీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో.. అంతా సవ్యంగా సాగితే ఆ ఏకైక గిరిజన ఓటర్‌ ఆగ్రామానికి సర్పంచ్‌ కానున్నారు. ఇక్కడ మరో విశేషమేంటంటే.. సదరు ఓటర్‌ మూగ, చెవిటి వ్యక్తి. ఈ ప్రత్యేకతతో కూడిన వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నిక కావడం దేశంలోనే తొలిసారి కానున్నది. ధనసరి గ్రామంలో పుట్టిపెరిగిన గిరిజనుడు లాలు తల్లిదండ్రులు చిన్ననాటనే కన్నుమూశారు.


అయినప్పటికీ గ్రామాన్ని వదలకుండా ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. త్వరలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ధనసరి గ్రామం పేరు మార్మోగిపోతున్నది. సర్పంచ్‌ పదవికి తనను ఏకగ్రీవంగా ఎన్నుకొనే అవకాశం ఉన్న లాలూతో.. సామాజిక కార్యకర్త జ్ఞానేంద్ర పురోహిత్‌ సంజ్ఞలతో మాట్లాడి ఆయన అభిప్రాయాలను మీడియాకు వెల్లడించారు. ‘రానున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేస్తా. సర్పంచ్‌గా ఎన్నికై రైతుల బాగు కోసం పనిచేస్తా. అలాగే గ్రామంలో రోడ్ల రూపురేఖలు మార్చేందుకు కృషిచేస్తా’ అని హామీ ఇచ్చారు. 


logo