ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 08:03:11

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ టాండన్‌ కన్నుమూత

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ టాండన్‌ కన్నుమూత

లక్నో : మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌(85) కన్నుమూశారు. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ల‌క్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్‌.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అషుతోష్‌ టాండన్‌ వెల్లడించారు. గవర్నర్‌ టాండన్‌ మృతిపట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గవర్నర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

గవర్నర్ లాల్జీ టాండన్ కొద్ది రోజుల‌ క్రితం సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌‌కు వెళ్లి అస్వస్థతకు గురయ్యారు. జూన్ 11న జ్వరం, మూత్ర సంబంధ సమస్యలతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని మేదాంత దవాఖానలో ఆయన చేరారు. అనంతరం ఆయనకు కాలేయం, కిడ్నీ సమస్యలున్నట్లు వైద్యులు గుర్తించారు. నాటి నుంచి ల‌క్నోలోని మేదాంత దవాఖానలోనే లాల్జీ టాండన్ చికిత్స పొందుతున్నారు. జూన్ 30న, ఈ నెల 16న కూడా ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. తాజాగా సోమవారం గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు మేదాంత దవాఖాన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. మంగ‌ళ‌వారం ఉద‌యం టాండ‌న్ క‌న్నుమూశారు. గ‌వ‌ర్న‌ర్ కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఫ‌లితం నెగిటివ్ వ‌చ్చింది.


logo