శనివారం 11 జూలై 2020
National - Jun 27, 2020 , 01:08:10

గేదెను చూసుకోవాలి. సెలవివ్వండి!

గేదెను చూసుకోవాలి. సెలవివ్వండి!

భోపాల్‌ పోలీసు విజ్ఞప్తి.. సరేనన్న బాస్‌

భోపాల్‌: దేశంలో కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి క్షణం తీరికలేకుండా పోయింది. గత మూడు నెలలుగా సెలవులు లేకపోవడంతో మధ్యప్రదేశ్‌ పోలీసులు విసుగెత్తిపోయారు. వివిధ కారణాలు చూపుతూ సెలవులకు విజ్ఞప్తులు పెట్టుకుంటున్నారు. అయితే, రెవా పట్టణంలోని ప్రత్యేక సాయుధ దళం(ఎస్‌ఏఎఫ్‌) 9వ బెటాలియన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ సెలవు కోసం చూపించిన కారణం పోలీసు శాఖలో చర్చకు తెరతీసింది. ఇంటిదగ్గరున్న తన గేదెకు ఇటీవల ఓ దూడ పుట్టిందని, దాని బాగోగులు చూసుకోవడం తనకు ముఖ్యమని పేర్కొంటూ సదరు కానిస్టేబుల్‌ ఆరు రోజుల సెలవు కోరాడు. పోలీసు శాఖలో ఉద్యోగం కోసం పరీక్షలకు సంసిద్ధం అయ్యేప్పుడు రోజూ ఆ గేదె పాలు తాగేవాడినని, అందుకే తాను పరీక్షల్లో నెగ్గానని చెప్పుకొచ్చాడు. దీంతోపాటు తన తల్లికి కూడా ఆరోగ్యం బాగా ఉండట్లేదని కూడా తెలిపాడు. కాగా కారణం ఏదైనా.. తన సిబ్బంది సెలవులు కోరితే, ఇవ్వడం తన బాధ్యతని బెటాలియన్‌ కమాండెంట్‌ ఆర్‌ ఎస్‌ మీనా పేర్కొన్నారు.  logo