శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 20:01:00

బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

భోపాల్: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ బీజేపీలో చేరారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయనకు కమలం జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంధాట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ గురువారం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మకు రాజీనామా పత్రాన్ని అందజేయగా దానిని ఆయన ఆమోదించారు. దీంతో గురువారం సాయంత్రమే నారాయణ్ పటేల్ బీజేపీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా మల్హేరా ఎమ్మెల్యే ప్రద్యుమాన్ సింగ్ లోధి, నేపానగర్ ఎమ్మెల్యే సుమిత్ర దేవి కాస్దేకర్ కూడా ఇటీవల తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా నారాయణ్ పటేల్ రాజీనామాతో ఈ నెలలో కాంగ్రెస్‌ని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు ఆయన రాజీనామాతో మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల సంఖ్య 27కు చేరింది. జ్యోతిరాదిత్య సింధియా సహా ఆయనకు విధేయులైన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వైదొలగడంతో ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
logo