మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 18:03:12

మధ్యప్రదేశ్‌లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

మధ్యప్రదేశ్‌లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మంధాట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ తన సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మకు తన రాజీనామా పత్రాన్ని అందజేయగా దానిని ఆయన ఆమోదించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల సంఖ్య 27కు చేరింది. బడా మల్హేరా ఎమ్మెల్యే ప్రద్యుమాన్ సింగ్ లోధి, నేపానగర్ ఎమ్మెల్యే సుమిత్ర దేవి కాస్దేకర్ ఇటీవల రాజీనామా చేశారు. తాజాగా నారాయణ్ పటేల్ రాజీనామాతో ఈ నెలలో కాంగ్రెస్‌ని వీడిన ఎమ్మెల్యే సంఖ్య మూడుకు చేరింది.

భోపాల్‌లో ఇటీవల నిర్వహించిన సీఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలతో విధేయత ప్రమాణం చేయించిన కొన్ని రోజుల్లోనే కొందరు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయడం గమనార్హం. మరోవైపు ఉప ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తున్నాయి. జ్యోతిరాదిత్య సింధియాతో సహా ఆయన‌కు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వైదొలగడంతో ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.


logo