బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 06:41:36

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో నేడు బలపరీక్ష

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో నేడు బలపరీక్ష

న్యూఢిల్లీ  : మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఒక్క అజెండాతోనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని, సభ్యులు చేయి పైకెత్తే విధానంలో బలపరీక్ష నిర్వహించి వీడియో రికార్డింగ్‌ చేయాలని పేర్కొంది. సభకు ఎలాంటి అవరోధం, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా  చూడాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచించింది. బలనిరూపణ కోసం బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌లు డీవై చంద్రచూడ్‌, హేమంత్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

 స్పీకర్‌ ప్రజాపతి కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడాలని కోర్టు తొలుత సూచించింది. ఆ ఎమ్మెల్యేలు నిర్బంధంలో ఉన్నారని భావిస్తే కోర్టు పరిశీలకులను నియమించి వారి వద్దకు పంపుతామని చెప్పింది. కాగా సుప్రీంకోర్టు సూచనను స్పీకర్‌ ప్రజాపతి తిరస్కరించారు. ఆయా  న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీంకోర్టు మార్చి 20నే (శుక్రవారం) కమల్‌నాథ్‌ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. 22 మంది కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేల్లో ఆరుగురి రాజీనామాలను స్పీకర్‌ ప్రజాపతి శనివారం ఆమోదించారు. మిగిలిన 16 మంది రాజీనామాలను గురువారం ఆమోదించారు.


logo
>>>>>>