శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 15:31:57

లుపిన్‌ నుంచి ఫావిపిరవిర్‌.. ఒక్క ట్యాబ్లెట్‌ ధర రూ .49

లుపిన్‌ నుంచి ఫావిపిరవిర్‌.. ఒక్క ట్యాబ్లెట్‌ ధర రూ .49

న్యూ ఢిల్లీ: కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీవైరల్‌ డ్రగ్‌ ఫావిపిరవిర్‌ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లుపిన్‌ బుధవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘కొవిహాల్ట్‌’ పేరుతో దీన్ని లాంచ్‌ చేస్తున్నారు. ఒక్క ట్యాబ్లెట్‌ ధర రూ. రూ .49గా నిర్ణయించారు. ఈ మేరకు ఆ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితులకు చికిత్స కోసం ఈ ఔషధాన్ని వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

ఫావిపిరవిర్‌కు డీసీజీఐ నుంచి అత్యవసర ఉపయోగం కోసం అనుమతి లభించిందని లుపిన్ కంపెనీ తెలిపింది. అందరికీ అందుబాటులో ఉండేలా కొవిహాల్ట్‌ పేరుతో దీన్ని తగిన మొత్తంలో తయారుచేశామని పేర్కొంది. ఒక్క ట్యాబ్లెట్‌ 200 మిల్లీ గ్రాంలు ఉంటుందనీ, 10 ట్యాబ్లెట్ల స్ట్రిప్‌ రూపంలో లభిస్తుందని వివరించింది. ఒక్క ట్యాబ్లెట్‌ ధర రూ .49 ఉంటుందని వెల్లడించింది. క్షయ వ్యాధికి ఎలాగైతే మందులు సరఫరా చేశామో, అదే తరహాలో కొవిడ్‌ చికిత్సకు ఈ కొవిహాల్ట్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామని లుపిన్‌ ఇండియా రీజియన్‌ ఫార్ములేషన్స్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ సిబల్‌ తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo