మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 14:34:50

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఉద్యోగినికి లైంగిక వేధింపులు

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఉద్యోగినికి లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పనిచేసే ఓ మేనేజర్ తన కింద పనిచేసే ఉద్యోగినిపై కన్నేశాడు. మ‌రో సహోద్యోగితో కలిసి ఆ ఉద్యోగినిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. లైంగికంగా వేధిస్తూ లొంగకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆరు నెల‌లు వేధింపులు భ‌రించిన ఉద్యోగిని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో మేనేజ‌ర్ కటకటలాపాలయ్యాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన మ‌రు క్ష‌ణ‌మే స‌ద‌రు ఉద్యోగినిని విధుల నుంచి తొల‌గించ‌డం గ‌మ‌నార్హం.  

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-3లోని లాంజ్‌లో 42 ఏండ్ల వ్యక్తి జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే విమానాశ్రయంలో ఓ 26 ఏండ్ల మహిళ ఫుడ్ అండ్ బేవరేజస్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. అయితే ఆ మహిళపై స‌ద‌రు జ‌న‌ర‌ల్‌ మేనేజర్ కన్నేశాడు. ఆమెను లొంగదీసుకునేందుకు పలురకాలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. అక్కడే పనిచేసే డ్యూటీ మేనేజర్ సాయంతో ఆమెను వేధించాడు. 

అయినా సద‌రు మ‌హిళ లొంగ‌క‌పోవ‌డంతో డ్యూటీని తొలగిస్తాన‌ని బెదిరించాడు. జనరల్ మేనేజర్ కార్యాలయంలోని ప్ర‌త్యేక గ‌దికి రావాలని ప‌లుమార్లు ఆదేశించాడు. అయినా విన‌క‌పోవ‌డంతో స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా ఆమెపై ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ చేతులతో తాక‌డం చేసేవాడు. దాదాపు ఆరు నెల‌లు ఈ హింస‌ను భ‌రించిన మ‌హిళ చివ‌ర‌కు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 


logo