మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 14:19:53

డ్ర‌గ్స్ కేసులో మాజీ మంత్రి కుమారుడిపై లుక్ఔట్ నోటీసులు

డ్ర‌గ్స్ కేసులో మాజీ మంత్రి కుమారుడిపై లుక్ఔట్ నోటీసులు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క డ్ర‌గ్స్ కేసులో ఆ రాష్ర్ట మాజీ మంత్రి, దివంగ‌త జీవ‌రాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వాపై సెంట్ర‌ల్ క్రైం బ్రాంచ్ లుక్ఔట్ నోటీసులు జారీచేసింది. గ‌త కొంత కాలంగా ఇత‌ను క‌నిపించ‌కుండాపోయాడు. అరెస్టును త‌ప్పించుకునేందుకే ఆదిత్య ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు. దేశం విడిచి వెళ్లే అవ‌కాశాలు ఉండ‌టంతో అప్ర‌మ‌త్త‌మైన సెంట్ర‌ల్ క్రైం బ్రాంచ్ దేశంలోని అన్ని విమానాశ్ర‌యాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఇదే కేసును ద‌ర్యాప్తు చేస్తున్న అంతర్గత భద్రతా విభాగం క్రీడా ప్రముఖులతో పాటు కొంతమంది టెలివిజన్, సినీ కళాకారులను విచార‌ణ‌కు పిలిచింది. అయితే ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. కేసులో 67 మందికి నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు.

బెంగళూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులను మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన తరువాత రాష్ర్ట పోలీసులు సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల గురించి దర్యాప్తు ప్రారంభించారు. అరెస్టు అయిన నిందితులు కన్నడ సినీ నటులు, గాయకులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న‌ట్లుగా తెలిపారు. ఈ కేసులో సెంట్ర‌ల్ క్రైం బ్రాంచ్ ఇప్ప‌టివ‌ర‌కు 13 మంది వ్య‌క్తుల‌ను అరెస్టు చేసింది. ఏడుగురిపై లుక్ఔట్ నోటీసులు జారీచేసింది. అరెస్టు అయిన వారిలో సినీ నటీ రాగిని ద్వివేది, సంజన, రియల్టర్ రాహుల్ థాన్స్, ఆర్టీఓ క్లర్క్ బి.కె.రవిశంకర్ ఉన్నారు.


logo