గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 12:36:16

సీఎం గెహ్లాట్‌కు గుణ‌పాఠం చెబుతా.. వార్నింగ్ ఇచ్చిన మాయావ‌తి

సీఎం గెహ్లాట్‌కు గుణ‌పాఠం చెబుతా.. వార్నింగ్ ఇచ్చిన మాయావ‌తి

హైద‌రాబాద్‌: బీఎస్‌పీ చీఫ్ మాయావ‌తి ఇవాళ రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం గెహ్లాట్‌కు తాను గుణ‌పాఠం నేర్ప‌నున్న‌ట్లు ఆమె అన్నారు. రాజ‌స్థాన్ రాజ‌కీయ సంక్షోభంపై మాయావ‌తి ఇవాళ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత త‌మ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఎటువంటి ష‌ర‌తులు లేకుండానే కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ఆమె చెప్పారు.  కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు, బీఎస్‌పీని న‌ష్ట‌ప‌రిచేవిధంగా అప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా త‌మ ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశార‌ని ఆమె అన్నారు. గ‌తంలో సీఎంగా చేసిన స‌య‌మంలోనూ గెహ్లాట్ ఇలాంటి అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు మాయా ఆరోపించారు. గెహ్లాట్ చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూ గ‌తంలోనూ కోర్టుకు వెళ్లాల‌నుకున్నామ‌ని, కానీ స‌రైన సంద‌ర్భంలోనే గెహ్లాట్‌కు, కాంగ్రెస్ పార్టీకి గుణ‌పాఠం చెప్పాల‌ని ఎదురుచూశామ‌ని మాయావ‌తి తెలిపారు. అందుకే ఇప్ప‌డు కోర్టుకు వెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్లు ఆమె చెప్పారు. ఈ విష‌యాన్ని ఇప్పుడు వ‌దిలేది లేద‌ని, అవ‌స‌ర‌మైతే తాము సుప్రీంకోర్టుకు కూడా వెళ్ల‌నున్న‌ట్లు బీఎస్‌పీ చీఫ్ తెలిపారు.  

ఒక‌వేళ అసెంబ్లీ జ‌రిగితే, బీఎస్‌పీ గుర్తుపై ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని ఆదేశించామ‌ని, ఒక‌వేళ వారు అలా చేయ‌ని ప‌క్షంలో వారి పార్టీ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తామ‌న్నారు. మ‌రోవైపు బీఎస్‌పీ ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ బీజేపీ నేత మ‌ద‌న్ దిలావ‌ర్ రాజ‌స్థాన్ హైకోర్టును రెండ‌వ సారి ఆశ్ర‌యించారు. నిన్న ఆయ‌న పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేయ‌డంతో మ‌ళ్లీ ఇవాళ ఆయ‌న కోర్టుకు వెళ్లారు.  

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించిన‌ట్లు మాయావ‌తి ఆరోపించారు.  నేర‌స్తులే రాజ్య‌మేలుతున్నార‌న్నారు.  రాష్ట్రంలో ప‌రిస్థితి మెరుగ‌వ్వాలంటే.. బీఎస్‌పీ నుంచి యూపీ సీఎం నేర్చుకోవాల‌న్నారు.  నాలుగుసార్లు త‌మ పార్టీ యూపీలో పాలించింద‌ని, ఆ స‌మ‌యంలో రాష్ట్రంలో శాంతి, భ‌ద్ర‌త‌లు స్థిరంగా ఉన్న‌ట్లు ఆమె చెప్పారు.  

  


logo