ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 01:26:56

సరిహద్దుల్లో హైటెక్‌ టన్నెల్‌

సరిహద్దుల్లో హైటెక్‌ టన్నెల్‌

  • మనాలీ-లెహ్‌ను అనుసంధానించేలా నిర్మాణం
  • సరిహద్దుల్లోకి సైన్యం తరలింపు ఇక సులభం
  • 10 వేల అడుగుల ఎత్తు.. 9.02 కిలోమీటర్ల పొడవు
  • ప్రపంచంలోనే అతి పొడవైనదిగా రికార్డు
  • వచ్చే నెల 3న ప్రారంభించనున్న ప్రధాని

సిమ్లా: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత సైన్యం చేతికి పాశుపతాస్త్రం లభించనుంది. ప్రపంచంలోనే అతిపొడవైన, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘అటల్‌' రహదారి టన్నెల్‌ త్వరలో ప్రారంభం కానున్నది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీ, లఢక్‌లోని లేహ్‌ను అనుసంధానించే ఈ సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలకు సైన్యాన్ని, ఆయుధాల్ని, వాహనాలను తరలించడం సులభం కానున్నది. ఈ సొరంగాన్ని వచ్చే నెల 3న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 

సాధారణంగా సొరంగ మార్గాల్లో ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు పనిచేయవు. కానీ, బీఎస్‌ఎన్‌ఎల్‌తో ప్రత్యేక ఒప్పందం చేసుకుని అటల్‌ టన్నెల్‌లో 24 గంటలపాటు నిరవధిక 4జీ ఇంటర్నెట్‌ సేవలు లభించే ఏర్పాట్లు చేశారు. సొరంగ నిర్మాణంలో అడుగడుగున భద్రతకు సంబంధించిన పలు జాగ్రత్తలు తీసుకున్నారు. సొరంగం పొడవునా వెంటిలేషన్‌ (గాలి, వెలుతురు సరఫరా) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 60 మీటర్ల దూరంలో అగ్నిమాపక పరికరాలు, ప్రతి 500 మీటర్ల దూరంలో అత్యవసర మార్గాలు (ఎగ్జిట్‌), ప్రతి కిలోమీటరు దూరంలో గాలి నాణ్యతను పరీక్షించే వ్యవస్థ, ప్రతి 250 కిలోమీటర్ల దూరంలో సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ టెలిఫోన్‌ బూత్‌లు, బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. 

సొరంగం విశేషాలు

  • మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరు మీదుగా దీనికి అటల్‌ టన్నెల్‌ అని నామకరణం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌ పాస్‌ కింద దీన్ని నిర్మిస్తున్నారు. 
  • సముద్ర మట్టానికి 3 వేల మీటర్లు (10 వేల అడుగులు) ఎత్తులో, 9.02 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు.
  • ఈ సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే, మనాలీ-లెహ్‌ మధ్య దూరం 46 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. నాలుగు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

అనుకున్న బడ్జెట్‌ కంటే తక్కువే..

1983లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో టన్నెల్‌ నిర్మాణంపై తొలిసారిగా చర్చలు జరిగినప్పటికీ, 2002లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో నిర్మాణంపై స్పష్టత వచ్చింది. 2009లో ప్రాజెక్ట్‌ డిజైన్‌ పనులు మొదలయ్యాయి. 2010 జూన్‌ 28న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.4,083 కోట్ల బడ్జెట్‌ అంచనా వేయగా, రూ.3,200 కోట్లతోనే నిర్మించారు.
logo