శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 16:32:11

షెడ్యూల్‌ కంటే ముందే లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా

షెడ్యూల్‌ కంటే ముందే లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా

న్యూఢిల్లీ: ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్న‌ది. దేశంలోనూ క‌రోనా ఎఫెక్ట్ తీవ్ర‌మైంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాల్లో కేంద్రం లాక్‌డౌన్ విధించ‌డంతోపాటు ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ ను అమ‌ల్లోకి తేవ‌డంతో  జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. ఈ ఉద‌యం సుప్రీంకోర్టు సైతం ఇక‌పై న్యాయ‌వాదులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాత్ర‌మే వాద‌న‌లు వినిపించాల‌ని, నేరుగా కోర్టుకు రాన‌వ‌స‌రం లేద‌ని సూచించింది.  

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు లోక్‌స‌భ‌ సైతం నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది.  క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నేప‌థ్యంలో లోక్‌స‌భ‌ను షెడ్యూల్ కంటే రెండు వారాల ముందే వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌క‌టించారు. అయితే వాయిదాకు ముందు లోక్‌స‌భ ఎలాంటి చ‌ర్చ లేకుండానే 2020 సంవ‌త్సరానికి సంబంధించిన ఆర్థిక బిల్లును ఆమోదించింది. మ‌రో రెండు బిల్లుల‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. కాగా, షెడ్యూల్ ప్ర‌కారం లోక్‌స‌భ ఏప్రిల్ 3వ తేదీ వ‌ర‌కు కొన‌సాగాల్సి ఉంది. 


logo