శనివారం 05 డిసెంబర్ 2020
National - Sep 23, 2020 , 07:42:10

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ సమావేశాలు?

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ సమావేశాలు?

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బుధవారంతో ముగిసే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత శనివారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ ప్రతిపక్షాలతో చర్చించింది. ఇటీవల సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలు మహమ్మారినపడడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాగే రాజ్యసభ సైతం వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 14న సమావేశాలు ప్రారంభం కాగా.. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు జరగాల్సి ఉంది.

పార్లమెంట్‌ సెషన్స్‌కు ముందే లోక్‌సభకు చెందిన 17 మంది ఎంపీలు, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. గతవారంలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ పటేల్‌ వైరస్‌ బారినపడ్డారు. శుక్రవారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్‌ సహస్రబుద్ధే వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. అంతకు ముందు రోజు ఆయన సభలో ప్రసంగించారు. మహమ్మారి సంక్రమణ క్రమంలో ఎంపీలకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు పార్లమెంట్‌లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రెండు విడుతల్లో ఉభయ సభలు సమావేశం నిర్వహిస్తున్నారు.

సభలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రాంగణంలోకి ప్రవేశించే విలేకరులు, పార్లమెంటరీ సిబ్బంది ప్రతి రోజూ యాంటిజెన్ పరీక్షను తప్పనిసరి చేశారు. ఇదిలా ఉండగా.. సెషన్ ముగిసే ముందు, పార్లమెంటులో 11 ఆర్డినెన్స్‌లను క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జీరో అవర్‌ ముగిశాక లోక్‌సభ, ఐదు బిల్లులపై చర్చించాక రాజ్యసభ నిరవధిక వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన లోక్‌సభ సమావేశం బుధవారం సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్‌ విడుదల చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.