సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 23:35:42

బెంగళూర్‌లో లాక్‌డౌన్‌ పొడిగించబోం : మంత్రి అశోక్‌

బెంగళూర్‌లో లాక్‌డౌన్‌ పొడిగించబోం : మంత్రి అశోక్‌

బెంగళూర్‌ : కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూర్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు ఉందని ఆ రాష్ట్ర మంత్రి అశోక్‌ మంగళవారం స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ పొడిగింపుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ఇప్పటికే నిపుణుల సలహా తీసుకున్నామని గతంలో నిర్ణయించిన విధంగా ఈ నెల 22నే లాక్‌డౌన్‌ ముగుస్తుందని పేర్కొన్నారు.

ఇదిలాఉండగా బ్రిహాత్‌ బెంగళూర్‌ మహానగర్‌ పాలికే (బీబీఎంపీ) మేయర్‌ గౌతమ్‌కుమార్‌ నగరంలో మరో వారంపాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా కేసులను అధిగమించేందుకు లాక్‌డౌన్‌ సమయం ఎక్కువగా ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూర్‌లో వారంపాటు విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14న రాత్రి 8 గంటల నుంచి అమల్లోకిరాగా 22 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

ఇవాళ తాజాగా కర్ణాటకలో 3,693 కరోనా కేసులు నమోదుకాగా 115 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ  తెలిపింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 55,115 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 20,757 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 33,205 మంది దవాఖానల్లో చికిత్స  పొందుతుండగా 1,147 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.logo