గురువారం 04 జూన్ 2020
National - May 18, 2020 , 00:54:51

జోన్ల నిర్ణయం రాష్ర్టాలకే

జోన్ల నిర్ణయం రాష్ర్టాలకే

 • పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతి
 • మే 31 వరకు లాక్‌డౌన్‌.. కేంద్ర మార్గదర్శకాలు విడుదల
 • మెట్రో, విమాన సేవలపై నెలాఖరు వరకు నిషేధం
 • విద్యాసంస్థలు, హోటళ్లు, సినిమాహాళ్లు, మాల్స్‌పై కూడా
 • రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకూ కఠినంగా కర్ఫ్యూ

కంటైన్మెంట్‌, రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లపై నిర్ణయాధికారాన్ని కేంద్రం రాష్ర్టాలకే అప్పగించింది. పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర రవాణాను నడిపేందుకు కూడా వెసులుబాటును కల్పించింది. 

న్యూఢిల్లీ, మే 17: కరోనా ప్రభావం అధికంగా ఉన్న కంటైన్మెంట్‌, రెడ్‌ జోన్లతోపాటు ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాధికారం రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదేనని కేంద్రం ప్రకటించింది. పరస్పర అంగీకారంతో రవాణా సేవల ప్రారంభానికి రాష్ర్టాలకు అవకాశం కల్పించింది. ఆదివారంతో మూడో విడుత లాక్‌డౌన్‌ గడువు పూర్తైన నేపథ్యంలో ఈ నెల 31 వరకు కొనసాగనున్న నాలుగోదశ లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్ని ఆదివారం సాయంత్రం కేంద్ర హోం శాఖ జారీ చేసింది. మెట్రో, విమాన సేవలపై నిషేధంతోపాటు  విద్యాసంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసి ఉంటాయని తెలిపింది. కరోనా ప్రభావం ఎక్కువున్న ప్రాంతాల్లో(హాట్‌స్పాట్లలో) ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తా   ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉద యం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. 

నిషిద్ధ జాబితా

 • దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. దేశీయంగా మెడికల్‌ సేవలు, ఎయిర్‌ ఆంబులెన్స్‌, భద్రతకు సంబంధించినవి, కేంద్ర హోంశాఖ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది.
 • మెట్రో రైలు సేవలుస్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లకు అనుమతి లేదు. ఆన్‌లైన్‌/దూరవిద్య  క్లాసులకు మినహాయింపు.
 • హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్పిటాలిటీ సర్వీసులు. బస్‌ స్టాపులు, రైల్వే స్టేషన్‌లు, విమానాశ్రయాల్లో క్యాంటీన్లు తెరువడానికి, హోండెలివరీ చేసే హోటళ్లు, రెస్టారెంట్లు కిచెన్‌లను తెరిచేందుకు అనుమతి.
 • సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, వినోద పార్కులు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాల్స్‌ తెరిచేందుకు అనుమతి లేదు. అయితే ప్రేక్షకులు లేకుండా క్రీడా వేదికలు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతి. 
 • సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు.
 • మత సంబంధిత/ప్రార్థనలు జరిపే ప్రదేశాలు.
 • మతపరమైన సమ్మేళనాలు.

ఆరోగ్య సేతు

ఆఫీసులు, పని ప్రదేశాల్లో ఆరోగ్య భద్రత కోసం స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే ప్రతి ఉద్యోగితోనూ ఆరోగ్య సేతు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్లంతా ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా జిల్లా అధికారులు అవగాహన కల్పించాలి.

రాత్రిపూట కర్ఫ్యూ

అత్యవసర సేవలు మినహా రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథాతథం. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలు చేయాలి.

వీటిని అనుమతించాలి

 • నర్సులు, పారా మెడికల్‌ స్టాఫ్‌, పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్సులకు, ఔషధ నిపుణులు ఒక రాష్ర్టం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లవచ్చు. వారికి ఎలాంటి నిబంధనలూ వర్తించవు.
 • వస్తు రవాణా, కార్గో సేవలు, ఖాళీ ట్రక్కులను సైతం అన్ని రాష్ట్రాలు అనుమతించాలి. 
 • పొరుగు దేశాల ద్వారా వచ్చే వస్తువులు, కార్గో సేవలను అందిస్తున్న వాహనాలను అన్ని రాష్ట్రాలు అనుమతించాలి.

ఆంక్షలతో కూడిన అనుమతులు 

రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర అంగీకారంతో వాహనాలు, బస్సులు తదితర ప్రజారవాణాకు అనుమతి

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలదే తుది నిర్ణయం

కంటైన్మెంట్‌, బఫర్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో..

 • రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాధికారం ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే. అయితే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది.
 • కేంద్ర ఆరోగ్యశాఖ గైడ్‌లైన్స్‌కనుగుణంగా రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులు ఆయా జిల్లా అధికారులు నిర్ణయిస్తారు.  
 • కంటైన్మెంట్‌ జోన్ల నుంచి బయటకు, బయటి నుంచి లోపలికి ఎవ్వరూ రాకూడదు. అయితే, అత్యవసర వైద్య సహాయం, నిత్యావసరాలు వంటి పరిస్థితుల్లో వెసులుబాటు ఉంటుంది.
 • కంటైన్మెంట్‌ జోన్లలో ఇంటింటిపైనా నిఘా ఉండాలి.
 • 65 ఏండ్లు పైబడిన వృద్ధులు, గర్భిణీలు, 10 ఏండ్లలోపు చిన్నారుల్ని తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రానీయవద్దు.

సీఎస్‌, డీజీపీలతో రాజీవ్‌ గౌబ సమీక్ష

లాక్‌డౌన్‌ 4.0 నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదివారం రాత్రి అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో నూతన మార్గదర్శకాలపై వారితో చర్చించారు. తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.   

కొవిడ్‌-19 కట్టడికి కేంద్రం సూచనలు, నిబంధనలు

 • బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రాంతాల్లోముఖానికి మాస్కు తప్పనిసరి
 • బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రాంతాల్లో ఉమ్మివేయడం శిక్షార్హం. జరిమానా కూడా విధిస్తారు
 • ప్రయాణ సమయం, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటించాలి
 • పెండ్లిళ్ల్లకు గరిష్ఠంగా 50 మంది, అంత్యక్రియలకు గరిష్ఠంగా 20 మంది హాజరు కావచ్చు. అయితే, భౌతిక దూరం వంటి నియమాల్ని పాటించాలి
 • బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్‌, గుట్కా, ధూమపానం చేయడం నిషేధం
 • ఒకేసారి ఒక దుకాణంలో ఐదుగురు కంటే ఎక్కువమం ది కస్టమర్లు ఉండరాదు. ప్రతి ఇద్దరి మధ్య కనీసం 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా దుకాణం యజమానులు చర్యలు తీసుకోవాలి

పని ప్రాంతాల్లో సూచనలు

 • వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని కార్యాలయాలు సాధ్యమైనంతవరకు కొనసాగించాలి. దుకాణాలు, మార్కెట్లు, కంపెనీలు వేర్వేరు పని వేళల్ని పాటించాలి.
 • కార్యాలయంలోకి ప్రవేశించే ద్వారం, బయటకి వచ్చే ద్వారం దగ్గర థర్మల్‌ స్కానింగ్‌, హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్‌ తదితరాల్ని ఏర్పాటు చేయాలి. 
 • సిబ్బంది భౌతిక దూరం పాటించేలా చూడాలి.


logo