ఆదివారం 31 మే 2020
National - May 10, 2020 , 18:55:55

నడుస్తూ నడుస్తూ.. పిల్లాడికి జన్మనిచ్చింది

 నడుస్తూ నడుస్తూ.. పిల్లాడికి జన్మనిచ్చింది

బర్వానీ: లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు తమ సొంతూళ్లకు పోయేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కేంద్రం వీరి కోసం  రైళ్లును నడుపుతుండగా, తెలంగాణ ప్రభుత్వం ఏకంగా  బస్సులనే ఏర్పాటుచేసింది. అయినప్పటికీ కొందరు అమాయక వలసకూలీలు తమ ఇంటికి చేరుకొంటే చాలన్న ఆతృతతో ప్రభుత్వాలపై ఆధారపడకుండా కాళ్లకు పనిచెప్పారు. కొందరు సైకిళ్లపై, మరికొందరు నడుస్తూ వారివారి గ్రామాలకు చేరుకొంటున్నారు. 

ఇలాగే, తమ ఇంటికి చేరుకోవాలన్న తపనతో నడుస్తూ బయల్దేరిన ఓ మహిళ.. సరిగ్గా ప్రపంచ అమ్మల దినోత్సవం  రోజునే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాత్నాకు చెందిన శకుంతల (30) నిండు గర్భిణీ. మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి సాత్నాకు తన కుటుంబంతో బయల్దేరింది. దాదాపు 210 కిలో మీటర్లు నడిచి ధులే గ్రామానికి చేరుకోగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమెతోపాటుఉన్న మహిళలు ఆమెను రోడ్డు పక్కనే చీరలతో కట్టిన గుడిసెలోకి తీసుకెళ్లి ప్రసవానికి సాయపడ్డారు. అక్కడ ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకొన్న బర్వానీ పట్టణ అధికారులు.. ఆమెకు ఆరోగ్య పరీక్షలు జరిపి వారు వెళ్లేందుకు బస్సును సమకూర్చారు.


logo