శనివారం 30 మే 2020
National - May 23, 2020 , 02:05:59

14-29 లక్షల కేసులను అడ్డుకున్నాం

14-29 లక్షల కేసులను అడ్డుకున్నాం

  • 37-78 వేల మంది ప్రాణాలను రక్షించాం
  • లాక్‌డౌన్‌ వల్లే ఇదంతా సాధ్యమైంది: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణ చర్యలను పక్కాగా అమలు చేయడం వల్ల 14 నుంచి 29 లక్షల వైరస్‌ కేసులు నమోదు కాకుండా అడ్డుకోవడం సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే 37 - 78 వేల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు పేర్కొంది. సాధికారత బృందం 1 చైర్మన్‌, నీతి ఆయోగ్‌ (ఆరోగ్య) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌, దేశంలో కరోనా పరిస్థితి గురించి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తగిన సమయంలో స్పందించి లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్లనే కరోనా కేసులు, మరణాలను గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజుల్లో కేసులు రెట్టింపుకాగా ప్రస్తుతం 13.3 రోజులు పడుతున్నదన్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీలోనే 80% వైరస్‌ కేసులు, మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. కాగా, కరోనా కేసులు, మరణాలకు సంబంధించి వివిధ సంస్థలు అధ్యయనం చేసిన అంచనాల నమూనాలను కేంద్ర గణాంకాల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌ శ్రీవాస్తవ వివరించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షను దాడటంతోపాటు రోజూ వేలాదిగా కొత్త కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ అమలు విధానం, వైరస్‌ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ గురువారం కొన్ని మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని ఖండించిన అధికారులు ప్రభుత్వం సకాలంలో స్పందించడంతోనే దేశంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. శుక్రవారం నాటికి 48,534 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు చెప్పారు. మరణాల రేటు 3.13 నుంచి 3.02కు తగ్గిందన్నారు. కాగా, ఇప్పటి వరకు 27,55,714 కరోనా పరీక్షలను నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ అధికారి తెలిపారు. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ లక్షకుపైగా పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు.logo