బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 01:54:54

పూర్తి భిన్నంగా లాక్‌డౌన్‌ 4.0

పూర్తి భిన్నంగా లాక్‌డౌన్‌ 4.0

  • నూతన మార్గదర్శకాలతో అమలు చేస్తాం
  • నిత్యజీవితంలో ఈ నియమాలు భాగం కావాలి
  • మన ప్రగతి ఆగిపోరాదు.. ఓటమి ఒప్పుకోరాదు
  • లాక్‌డౌన్‌పై రాష్ర్టాలతో చర్చించి 18లోపు నిర్ణయం

న్యూఢిల్లీ, మే 12: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించే అవకాశముందని ప్రధాని నరేంద్రమోదీ సంకేతాలిచ్చారు. మూడో దశ లాక్‌డౌన్‌ ఈ నెల 17వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ర్టాలతో చర్చించి నాలుగో విడత లాక్‌డౌన్‌పై 18వ తేదీలోపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే నాలుగోవిడత లాక్‌డౌన్‌ పూర్తిగా భిన్నంగా ఉంటుందని మంగళవారం రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టంచేశారు. కరోనాతో మరణించినవారికి ప్రధాని సంతాపం తెలిపారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడుతూనే ప్రగతిపథంలో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.  

ప్రయాణం ఆగిపోరాదు..

కరోనా సంక్షోభానికి భయపడి మన ప్రయాణాన్ని ఆపేయకూడదని మోదీ అన్నారు. ఓటమి అనేది మన ఎంపిక అస్సలు కాకుడదని స్పష్టంచేశారు. ‘మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ముందుకు సాగే క్రమంలో ప్రభుత్వ మార్గదర్శకాలు మన జీవితంలో భాగం కావాలి. ప్రపంచం నేడు సంక్షోభంలో ఉంది. ఈ సమయంలో మనం మరింత స్థిరంగా ఉండాలి. మన నిబ్బరం ఈ సంక్షోభంకంటే గొప్పది. మనం బహిరంగ మలవిసర్జనను అరికడితే ప్రపంచమే మారిపోయింది. టీబీ, పోషకాహారలోపం, పోలియో ఇలా మనం దేనిని జయించినా ఆ ప్రభావం ప్రపంచంపై బలంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. భారత్‌ చాలా నిజాయితీగా ఉంటుందని ప్రపంచం నమ్ముతున్నదని తెలిపిన మోదీ.. భూగోళమంతా మానవత్వాన్ని మరింత సమున్నతం చేయటం భారత్‌కు సాధ్యమేనన్నారు. గత ఆరేండ్లుగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల వల్లే నేటి మహా సంక్షోభంలోనూ భారత్‌ స్థిరంగా ఉన్నదని తెలిపారు. 

ప్రధాని ముందుండి నడిపిస్తున్నారు: బీజేపీ

సంక్షోభంలో ప్రధాని మోదీ దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రూ.20 లక్షల కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉపశమన ప్యాకేజీని ప్రకటించారన్నారు. ఇది ప్రతి వర్గానికి అండగా నిలుస్తుందన్నారు. మరోవైపు కేంద్రంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. వలస కూలీలను కష్టాల నుంచి గట్టెక్కించడంలో ప్రధాని వైఫల్యం దేశాన్ని నిరాశపరిచిందని పేర్కొంది. 

స్థానిక ఉత్పత్తులే కొనాలి

కరోనా సంక్షోభంతో స్థానిక ఉత్పత్తులు, తయారీరంగం ప్రాధాన్యం మరోసారి తెలిసివచ్చిందని ప్రధాని అన్నారు. ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తులను విధిగా కొనుగోలుచేసి వాటి గురించి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షోభాల సమయంలో స్థానిక తయారీరంగమే డిమాండ్‌ను భర్తీచేయగలద ని చెప్పారు. స్థానికత అనేది మన జీవనమంత్రం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా స్థానిక ఉత్పత్తులను కొనుగోలుచేసి ప్రచారం చేస్తే అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు. 


logo