శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 22:47:46

అయోధ్య రామాలయం భూమిపూజకు అద్వానీ, మోహన్‌ భగవత్‌

అయోధ్య రామాలయం భూమిపూజకు అద్వానీ, మోహన్‌ భగవత్‌

న్యూఢిల్లీ : ఆగస్టు 5న అయోధ్యలో శ్రీరామ ఆలయ భూమిపూజ కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ హాజరవుతారని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. అలాగే కార్యక్రమాన్ని దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని పేర్కొన్నారు. వీరితో పాటు అన్ని మత విశ్వసాలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించే అభిప్రాయం కూడా ఉందని శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్రా పీటీఐకి తెలిపారు.  కరోనా వైరస్ మహమ్మారి, సామాజిక దూరం ఆంక్షల నేపథ్యంలో 200 మంది వరకు పరిమిత సంఖ్యలో హాజరవుతారని, తుది జాబితా ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు.

వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ అలోక్‌కుమార్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య నేత మోహన్‌ భగవత్‌, ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ, జోషిలను ఆహ్వానిస్తున్నట్లు మరో ధర్మకర్త కామేశ్వర్ చౌపాల్ వివరించారు. రామ ఆలయ భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరై, అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. భూమిపూజ కోసం గురుద్వారా, బౌద్ధ, జైన దేవాలయాలతో పాటు అన్ని ప్రధాన ప్రార్థనా స్థలాల నుంచి మట్టిని సేకరిస్తున్నట్లు ట్రస్ట్‌ సభ్యులు చెప్పారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది కీలకమైన ముఖ్య సంఘటన అవుతుందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ పేర్కొన్నారు.

కార్యక్రమాన్ని దూరదర్శన్‌తో పాటు ఇతర ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయని వివరించారు. భక్తులు అయోధ్యకు రాకుండా ఇండ్లు, దేవాలయాల వద్ద పూజలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భూమిపూజ కార్యక్రమం కోసం మట్టి సేకరణ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్న వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌కుమార్‌ మాట్లాడుతూ జైన దేవాలయాలు, వాల్మీకి ఆలయాలు, ఢిల్లీలోని గురుద్వారా సిస్‌గంజ్‌ సహా వివిధ మత ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి అయోధ్యకు పంపినట్లు చెప్పారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించేందుకు దేశవ్యాప్తంగా డ్రైవ్‌ ప్రారంభిస్తుందని, సుమారు పది కోట్ల కుటుంబాలను చేరుకుంటామని పేర్కొన్నారు. ‘శతాబ్దానికి ఒకసారి’ జరిగే ఉత్సవంగా అభివర్ణించిన కుమార్‌, సంచలనాత్మక వేడుక గొప్ప కార్యక్రమంగా ఉంటుందని అన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo