బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 21, 2020 , 14:58:32

‘బిహార్ ఫస్ట్‌.. బిహారీ ఫస్ట్‌’.. మ్యానిఫెస్టోను విడుదల చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌

‘బిహార్ ఫస్ట్‌.. బిహారీ ఫస్ట్‌’.. మ్యానిఫెస్టోను విడుదల చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌

పాట్నా: త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు లోక్ జనశక్తి పార్టీ తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. బుధవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ ఈ మేరకు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అంతకు ముందు దివంగత తండ్రి, కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ను స్మరించుకుని నివాళులర్పించారు.

వ్యవసాయ ఆధారిత, భారీ యువ జనాభా ఉన్న రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. "నేను యువకుడిని. బాగా చదువుకున్నాను. నేను బిహార్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తాను. బిహీర్‌ను ప్రథమ స్థానంలో నిలుపుతాను" అని చెప్పారు. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి తరువాత బిహార్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పట్టించుకోలేదని, రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదన్నారు. సాగు, తాగునీరుకు ఇబ్బంది, పేలవమైన విద్యా విధానం, పారుదల వ్యవస్థలో లోపాలు, వలసలను నివారించడం, నిరుద్యోగాన్ని పారద్రోలడం, ప్రతి ఇంటికి విద్యుత్‌.. ఇలా ఎన్నో సమస్యలు ఇంకా మనల్ని పట్టిపీడిస్తున్నాయని, వీటిని ఇకనైనా పరిష్కరించుకోవాలన్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని తప్పించడం ద్వారా మనం ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి, తోటి బిహారీలకు మంచి చేయగల మార్గం లభిస్తుందని ఆయన అన్నారు.

మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలు : బిహార్‌లో పాడి పరిశ్రమను పెంచడానికి పార్టీ దశలవారీగా ‘డెన్మార్క్ మోడల్’ను అమలు చేస్తాం. అన్ని బ్లాక్ ప్రధాన కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మార్కెట్లలో మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మిస్తాం. సమాన ఉద్యోగానికి సమాన వేతనం అమలు చేస్తాం. అన్ని అవసరమైన జిల్లాల్లోని స్థానిక ఉత్పత్తులపై ప్రాధాన్యత ప్రాతిపదికన ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. వరదలు, కరవులను నివారించడానికి, కాలువలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని నదులను కలిపేలా చర్యలు తీసుకుంటాం.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు మూడు దశల్లో జరుగుతాయి. ఫలితాలు నవంబర్ 10 న ప్రకటించబడతాయి. అసెంబ్లీలో 243 సీట్లు ఉండగా.. మెజారిటీ మార్క్‌ 122. ప్రస్తుతం బీజేపీ-జనతాదళ్ (యునైటెడ్) కలయికలో ప్రభుత్వం కొనసాగుతున్నాది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.