బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 01:39:49

వైరస్‌తో కలసి జీవించాలి!

వైరస్‌తో కలసి జీవించాలి!

  •  ప్రజలకు కేంద్రం సూచన
  • 56,342కు చేరిన కేసులు
  • 1,886కి పెరిగిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచించింది. కరోనా సవాల్‌ను ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలని కోరింది. కరోనా రహిత జిల్లాలు పెరుగుతుండడం, కోలుకుంటున్న వారి సంఖ్య (రివకరీ రేటు) మెరుగవడం తమ ప్రభుత్వ విజయాలుగా పేర్కొన్నది. దేశంలో 216 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని వెల్లడించింది. 42 జిల్లాల్లో గత 28 రోజులుగా, 29 జిల్లాల్లో గత 21 రోజులుగా ఎలాంటి కేసు నమోదుకాలేదని తెలిపింది. రికవరీ రేటు 29.36 శాతంగా ఉన్నదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. గత 24 గంటల్లో 3,390  వైరస్‌ బారినపడగా, 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56,342కు చేరుకోగా, మృతుల సంఖ్య 1,886కి పెరిగింది. కాగా, కరోనా చైన్‌ను బ్రేక్‌ చేయడంలో ఇంకా విజయం సాధించలేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. పోలీసులు దశల వారీగా విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైతే కేంద్ర బలగాల కోసం కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. 

‘సమూహవ్యాప్తి’పై ఐసీఎంఆర్‌ అధ్యయనం

దేశంలో కరోనా మహమ్మారి సమూహ వ్యాప్తి దశకు చేరుకున్నదా లేదా అన్నది తెలుసుకునేందుకు ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌) అధ్యయనం నిర్వహించనున్నది. దేశవ్యాప్తంగా 75 కరోనా ప్రభావిత జిల్లాల్లోని రెడ్‌, ఆరంజ్‌ జోన్లలో ఈ అధ్యయనం చేపట్టనున్నది. 


logo