మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 17:51:15

కలిసి జీవిద్దాం.. ఒకరికొకరు సహకరించుకుందాం : ఉపరాష్ట్రపతి

కలిసి జీవిద్దాం.. ఒకరికొకరు సహకరించుకుందాం : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ : భారత ప్రాచీన జీవన పద్ధతైన ‘కలిసి జీవిద్దాం.. ఒకరికొకరు సహకరించుకుందాం’ విధానాన్ని కొనసాగిస్తూ తర్వాతి తరాలకూ కూడా ఇంతటి గొప్ప సంస్కృతిని, విలువలను అందజేయాల్సిన అవసరముందని భార‌త‌ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. దేశంతో పాటు యావత్ ప్రపంచ శ్రేయస్సుకోసం భారత ప్రాచీన విధానమైన తోటివారితో కలిసి పంచుకోవడం, అందరి పట్ల శ్రద్ధ చూపడం కూడా అలవర్చుకోవాలని ఉప‌రాష్ర్ట‌ప‌తి సూచించారు. మైసూరు 25వ మహారాజు శ్రీ జయ చామరాజ వడయార్ శత జయంత్యుత్సవాల ముంగింపు సందర్భంగా వెంక‌య్య‌నాయుడు ఆన్‌లైన్ వేదిక‌గా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఉప‌రాష్ర్ట‌ప‌తి మాట్లాడుతూ... 

భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహారాజ శ్రీ జయ చామరాజ వడయార్ వంటి పాలకుల దేశభక్తి, దీర్ఘదృష్టితో సమసమాజ స్థాపన లక్ష్యంతో వారు చేసిన  ప్రజారంజక పాలన ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. ఓ సమర్థవంతమైన పాలకుడిగా స్వాతంత్ర్యానికి పూర్వ భారతదేశంలో ఓ బలమైన, ఆత్మనిర్భరత, సుస్థిరాభివృద్ధి కలిగిన మైసూరు రాజ్య నిర్మాణంలో మహారాజ శ్రీ జయ చామరాజ వడయార్ పాత్ర అత్యంత కీలకం అని పేర్కొన్నారు. మైసూరులో ఓ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండాలని నిర్ణయించి రాజ్యాంగసభను ఏర్పాటుచేయడం, దీనికి కేసీ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించడం ఆయ‌న దూరదృష్టికి నిదర్శనమన్నారు. 

చాలా అంశాల్లో చాణక్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్న ఆదర్శాలను మహారాజా వారు ఆచరించార‌న్నారు. మహారాజ వారు ప్రాచీన విలువలు, ఆధునిక ఆలోచనల కలబోత అన్నారు. ఆధునిక భారతంలో బెంగళూరులో హిందుస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్స్ లిమిటెడ్ (తర్వాతి కాలంలో హెచ్ఏఎల్‌గా మారింది), జాతీయ క్షయవ్యాధి సంస్థ, మైసూరులో కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ, అఖిల భారత వాక్, శ్రవణ సంస్థ (ఆలిండియా స్పీచ్, హియరింగ్ ఇనిస్టిట్యూట్) వంటి ఎన్నో సంస్థల ఏర్పాటుకు సంపూర్ణమైన మద్దతు అందించారన్నారు. బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అభివృద్ధికి, విద్యార్థులకు ప్రోత్సాహకాల విషయంలోనూ ఆర్థిక సహాయం అందించార‌న్నారు. భారతీయ విలువలు, సంప్రదాయాలు, సాంస్కృతిక  వారసత్వాన్ని అలవర్చుకుని తర్వాతి తరాలకు అందించడంతో పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 


logo