శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 12, 2021 , 17:58:31

ఆరోగ్యం: చిన్న‌చిన్న పొర‌పాట్ల‌కు చెల్లించ‌క త‌ప్ప‌దు భారీ మూల్యం!

ఆరోగ్యం: చిన్న‌చిన్న పొర‌పాట్ల‌కు చెల్లించ‌క త‌ప్ప‌దు భారీ మూల్యం!

హైద‌రాబాద్‌: ఆరోగ్యకరమైన, పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాన్నే తీసుకోవాలని ఎంతగా అనుకున్నా.. మ‌న‌కు తెలియకుండానే ఆరోగ్యానికి హానిచేసే ప‌దార్థాలు ఎన్నో తీసుకుంటుంటాం. చిన్నచిన్న పొరపాట్లు కూడా క్యాన్సర్ లాంటి పెద్ద రోగాల బారిన‌ప‌డేసే ప్ర‌మాదం ఉంది. అందుకే భోజనం వండేటప్పుడు, తినేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. అంతేకాదు సమయానికి బోజనం చేయడం కూడా విధిగా పాటించాలి. 

ప్రాసెస్డ్ ఫుడ్, ఇన్‌స్టంట్‌ ఫుడ్ జోలికి వెళ్ల‌కుండా మన ప్రాంతంలో పండే కూరగాయలు, పండ్లు, ధాన్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇంపోర్టెడ్ పండ్డు, కూర‌గాయలు, ఇత‌ర ధాన్యాలు మంచివే అయినప్పటికీ మన శరీరతత్వానికి సరిపోకపోవచ్చు. అంతేగాక‌, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇంకా ఎలాంటి పొర‌పాట్లు చేయ‌కూడ‌దో ఒక‌సారి తెలుసుకుందాం..!

భోజనమే ముద్దు.. చిరుతిళ్లు వ‌ద్దు

  • హైద‌రాబాద్‌: భోజ‌నం రెగ్యుల‌ర్‌గా తీసుకోక‌పోతే అలసట, బద్ద‌కం, లో బీపీ, తలనొప్పి లాంటి స‌మ‌స్య‌లు చుట్టుముడుతాయి. ఎందుకంటే వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోతే పోష‌కాల కొర‌త ఏర్ప‌డుతుంది. ఈ పోష‌కాల కొర‌తే పై స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీల్స్‌ను మిస్ చేయకూడ‌దు. ఎక్కువ‌గా కాక‌పోయినా మితంగానైనా మీల్స్ తీసుకోవాలి. బరువు తగ్గాలంటే భోజనం మానొద్దు. మూడు పూటలా భోజ‌నం చేయాలి. కాక‌పోతే అతిగా కాకుండా మితంగా తీసుకోవాలి. భోజనం మానేయ‌డం వ‌ల్ల ఒంట్లో సహజసిద్ధంగా ఉండే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది.

పండ్లు, కూరగాయలు కడగకుండా తినొద్దు 

  • సాధార‌ణంగా పండ్లు, కూరగాయలపై సూక్ష్మ క్రిములు ఉంటాయి. అంతేగాక‌ చీడపీడల నివారణ కోసం పంటపొలాల్లో చల్లే రసాయనాలు కూడా వీటిపై పేరుకుని ఉంటాయి. కాబట్టి పండ్లు, కూరగాయలను కడగకుండా తిన‌డం ప్రమాదకరం. అలా చేయడంవల్ల క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. మ‌న నాడీ వ్య‌వ‌స్థ‌పై క్రిమి సంహార‌కాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. మన ఇమ్యూనిటీపై ఇవి దాడిచేస్తాయి. సంతానోత్పత్తిపై కూడా ఈ రసాయనాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. 

చెడిన ప‌దార్థాల వాసన, రుచి చూడొద్దు

  • ఇంట్లోగానీ, బ‌య‌ట‌గానీ ఎక్కువ రోజులు నిలువ‌చేసిన పండ్లు, కూర‌గాయ‌లపై సూక్ష్మ‌క్రిములు దాడి చేస్తాయి. దాంతో అవి పాడై పోతాయి. కాబ‌ట్టి అలాంటి వాటిని బాగున్నాయో లేవో తెలుసుకోవడానికి వాస‌న చూడ‌టం, రుచి చూడ‌టం చేయ‌కూడ‌దు. కంటికి కనిపించని సూక్ష్మక్రిములు మ‌న‌పై దాడి చేసేది ఇలాంటప్పుడే. 

పడుకునేముందు పండ్లు తినొద్దు

  • పడుకునే ముందు పండ్లు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ దానివ‌ల్ల‌ అజీర్తి, పంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు. యాసిడ్ ఎక్కువగా ఉన్న బత్తాయి, మామిడి, డ్రాగన్ ఫ్రూట్‌, టమోటా వంటివి పడుకునేముందు తింటేమాత్రం మీ పంటిపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది. ఎందుకంటే మీరు రాత్రంతా నిద్రపోతారు కనుక నోట్లోని యాసిడ్ ఇలా దంతాల అనారోగ్యానికి కారణం అవుతుంది. 
  • అదేవిధంగా తీపి ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను కూడా రాత్రి ప‌డుకునే ముందు తిన‌కూడ‌దు. ఎందుకంటే జీర్ణాశ‌యంలోకి వెళ్లిన చ‌క్కెర‌లు అరిగినంత తేలికగా పళ్లలో ఉన్న చ‌క్కెర‌లు జీర్ణం కావు. దాంతో క‌డుపునొప్పి, పొట్ట ఉబ్బ‌రం లాంటి స‌మ‌స్య‌లు రావ‌చ్చు. 

అల‌వాట్ల‌కు భిన్న‌మైన ఆహారం తీసుకోవ‌ద్దు

  • మ‌నం ఎప్పుడూ తినే ఆహార‌ప‌దార్థాలు కాకుండా భిన్న‌మైన వాటి జోలికి పోకుండా ఉండ‌టం మంచిది. మ‌న ప్రాంతంలో ల‌భించే  సంప్రదాయ ప‌దార్థాలకు బ‌దులుగా పూర్తిగా మెనూ మార్చ‌డం చాలా ప్రమాదకరం. ఎందుకంటే షుగర్, రీఫైన్డ్ షుగర్ అత్యధికంగా ఉన్న వెస్ట్రన్ మెనూ మన ఒంటికి అస్సలు సెట్ కాదు. అంతేకాదు ప్రాసెస్డ్ ఫుడ్ కూడా కావటంతో పోషకాల లోపం ఉంటుంది. దాంతో అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. 

చక్కెర మితాన్ని మించ‌కూడ‌దు

  • మనం రోజూ తినే ఆహారంలో ర‌క‌ర‌కాల చక్కెర స్థాయిలు ఉంటాయి. అంతేగాక టీ, కాఫీలు, స్వీట్లు, కేకులు, డెజర్ట్స్, జ్యూస్ వంటివాటిలో కూడా షుగర్ నిల్వలు ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. మితిమీరిన చక్కెర‌లు ఒంట్లో చేరితే కరిగించుకోవ‌డం చాలా కష్టం. దాంతో డయాబెటిస్‌, ఊబకాయం, డిప్రెషన్ వంటి స‌మ‌స్య‌లు వస్తాయి. తీపి ప‌దార్థాలు ఎక్కువ ఇష్ట‌మైతే చక్కెరకు బదులుగా తేనె, బెల్లం, తాటిబెల్లం వంటి ప్రత్యామ్నాయ ప‌దార్థాలు తీసుకోవాలి. వాటిని కూడా మితంగానే వాడాలి సుమీ..!

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo