సోమవారం 01 జూన్ 2020
National - May 09, 2020 , 01:05:01

సగం ‘కిక్కు’ దక్షిణాదిలోనే!

సగం ‘కిక్కు’ దక్షిణాదిలోనే!

ముంబై: మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ర్టాలు టాప్‌లో ఉన్నాయి. జాతీయస్థాయి వినియోగంతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాలు 45 శాతం వాటా కలిగి ఉన్నట్లు క్రిసిల్‌ నివేదిక పేర్కొంది. ఈ ఐదు రాష్ర్టాల రెవెన్యూలో ఎక్సైజ్‌ పన్నుల ద్వారా 10-15 శాతం ఆదాయం లభిస్తున్నట్లు తెలిపింది.  దేశవ్యాప్తంగా 12 రాష్ర్టాల్లోనే 75 శాతం మేర మద్యం వినియోగం జరుగుతున్నది. ఇందులో ఐదు దక్షిణాది రాష్ర్టాలతోపాటు ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా 85 శాతం కరోనా కేసులు ఈ 12 రాష్ర్టాల నుంచే నమోదు కావడం గమనార్హం. 

మద్యం షాపులు మూసేసి.. డోర్‌ డెలివరీ చేయండి! 

తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడాన్ని సవాల్‌ చేస్తూ సినీ నటుడు-మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హసన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించి డోర్‌ డెలివరీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు మద్యం దుకాణాల వద్ద జనం రద్దీని నివారించడానికి ఢిల్లీ ప్రభుత్వం గురువారం ‘ఈ-టోకెన్ల’ను ప్రారంభించింది.


logo