సోమవారం 01 జూన్ 2020
National - May 09, 2020 , 01:04:59

ఇండ్ల వద్దకే మద్యం

ఇండ్ల వద్దకే మద్యం

  • ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు..
  • సాధ్యాసాధ్యాలను పరిశీలించండి
  • రాష్ర్టాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో మద్యం విక్రయించే అంశాన్ని పరిశీలించాలని అన్ని రాష్ర్టాలకు సుప్రీంకోర్టు శుక్రవారం సూచించింది. కోవిడ్‌-19ను నియంత్రించేందుకు మద్యాన్ని ఇండ్లకే మద్యం సరఫరా చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. లాక్‌డౌన్‌ సడలింపు చర్యల్లో భాగంగా ఈ నెల 1న కేంద్ర హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాలను సవాలుచేస్తూ గురుస్వామి నటరాజ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించి జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. మద్యం షాపుల వద్ద కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించటంలేదని, అందువల్ల కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రద్దుచేయాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. నేరుగా కాకుండా హోం డెలివరీ, ఆన్‌లైన్‌ విక్రయాలు చేపట్టవచ్చని కోర్టు అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సాయిదీపక్‌ దేశంలో మొత్తం 70,000 మద్యం దుకాణాలు ఉన్నాయని, లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత దేశవ్యాప్తంగా 5 కోట్లమంది నేరుగా మద్యం కొనుగోలు చేశారని కోర్టుకు తెలిపారు. దుకాణాల వద్ద భారీ క్యూలైన్లు ఉంటున్నాయని, కొనుగోలుదారులు భౌతికదూరం పాటించకపోవటంతో వైరస్‌ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. అదే జరిగితే నెలన్నరగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ఫలితం నీరుగారిపోతుందని అన్నారు. 


logo