e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జాతీయం ఉసురు తీస్తున్న పిడుగులు

ఉసురు తీస్తున్న పిడుగులు

  • ఉత్తర భారతంలో పలుచోట్ల బీభత్సం
  • మూడు రాష్ర్టాల్లో 71 మంది మృత్యువాత
  • 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
  • పిడుగులతో గతేడాది 1,619 మంది మృతి
  • 70% మరణాలు చెట్ల కింద నిలబడటంవల్లే..
  • హాట్‌స్పాట్లలో ఎల్‌పీడీలు పెట్టాలి: నిపుణులు
ఉసురు తీస్తున్న పిడుగులు

జైపూర్‌/లక్నో, జూలై 12: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో పడిన పిడుగులకు 71 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వందలాది పశువులు మృత్యువాతపడ్డాయి. రాజస్థాన్‌లో పిడుగుపాట్లకు మరణించినవారి సంఖ్య సోమవారంనాటికి 41కి చేరింది. మధ్యప్రదేశ్‌లో ఏడుగురు మృతిచెందారు. రాజస్థాన్‌లో ఆదివారం వివిధ ప్రాంతాల్లో పడిన పిడుగులకు 23 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలను పరిహారంగా ఇస్తామన్నారు.

ఏమిటీ పిడుగుపాట్లు?
వాతావరణంలోని మేఘాలు, గాలి, భూమి మధ్య విద్యుత్తు ప్రవహించడాన్నే స్థూలంగా ‘పిడుగులు’గా పిలుస్తారు. ఇవి మూడు రకాలు. 1. మేఘాల మధ్య జరిగే విద్యుత్తు ప్రవాహం. 2. మేఘాలు-గాలి మధ్య జరిగే విద్యుత్తు ప్రవాహం. 3. మేఘాలు-భూమికి మధ్య జరిగే విద్యుత్తు ప్రవాహం. పిడుగుకు కారణమైన ఒక్కో మెరుపులో 30 కోట్ల వోల్టుల విద్యుత్తు జనిస్తుంది. ఈ శక్తితో 100 వాట్ల బల్బును నిరంతరాయంగా మూడు నెలల పాటు వెలిగించవచ్చు.

- Advertisement -

పిడుగుల హాట్‌స్పాట్లు ఇవే!
ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించే మొత్తం మరణాల్లో 35.3 శాతం మరణాలకు పిడుగుపాట్లే కారణం. గతేడాది ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు పిడుగుపాట్ల కారణంగా 1,619 మంది మరణించారు. ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌లను పిడుగులు పడే ప్రమాదమున్న హాట్‌స్పాట్లుగా గుర్తించారు.

ప్రాణనష్టాన్ని ఎలా నివారించవచ్చు?
ఉపగ్రహాలు, డాప్లర్‌, రాడార్ల సాయంతో పిడుగులు పడే ప్రాంతాలను ఎప్పటికప్పుడు గుర్తించాలి. పిడుగులు పడే ప్రమాదమున్న హాట్‌స్పాట్లలో లైటెనింగ్‌ ప్రొటెక్షన్‌ డివైజ్‌ల(ఎల్‌పీడీలు)ను (పిడుగు పడే మార్గాన్ని మార్చే పరికరం) ఏర్పాటు చేయాలి. పిడుగుపాట్లపై ప్రజలకు అవగాహన కల్పించాలి. వర్షం పడే సమయాల్లో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దు.

ఎందుకు భారత్‌లో ఎక్కువగా మరణిస్తున్నారు?
పిడుగుపాట్లలో మూడో రకమైన ‘మేఘాలు-భూమికి మధ్య జరిగే విద్యుత్తు ప్రవాహం’ కారణంగానే ఎక్కువగా ప్రాణ, ఆస్తినష్టం జరుగుతున్నది. భారత్‌లో నైరుతి రుతుపవనాలు మొదలయ్యే జూన్‌-జూలైలో సాధారణంగా రైతులు వ్యవసాయ పనులకు వెళ్తారు. ఈ సమయాల్లో వర్షం పడితే.. మైదాన ప్రాంతాల్లోని చెట్ల కింద తలదాచుకుంటారు. ఇదే పిడుగుపాట్లకు ప్రధాన కారణంగా మారుతున్నది. దేశంలో పిడుగుపాట్ల వల్ల నమోదయ్యే మొత్తం మరణాల్లో 70 శాతం మరణాలు చెట్ల కింద నిలబడటం వల్లనే సంభవిస్తున్నాయి. మిగతా మరణాలు బహిరంగ ప్రాంతాల్లో, కాంక్రీట్‌ ప్రదేశాల్లో ఉండటం వల్ల నమోదవుతున్నాయి. మేఘాల్లో ఉద్భవించే మెరుపు (విద్యుత్తు ప్రవాహం) భూమిని చేరుకోవడానికి ఒక మాధ్యమాన్ని (చెట్లు, కాంక్రీట్‌ నిర్మాణాలు వగైరా) సాయంగా తీసుకోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఉసురు తీస్తున్న పిడుగులు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉసురు తీస్తున్న పిడుగులు
ఉసురు తీస్తున్న పిడుగులు
ఉసురు తీస్తున్న పిడుగులు

ట్రెండింగ్‌

Advertisement