బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 25, 2020 , 12:54:30

సైనికుల కోసం దీపం వెలిగించండి.. ప్రజలకు ప్రధాని పిలుపు

సైనికుల కోసం దీపం వెలిగించండి.. ప్రజలకు ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ : ధైర్యవంతమైన సైనికులు, భద్రతా దళాలతో భారతదేశం దృఢంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొత్తగా కరోనా మహమ్మారి మధ్య పండుగలను జరుపుకుంటుండగా.. సైనికులకు ఒక దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో కాపలా కాస్తూ బయటి నుంచి వచ్చే ముప్పు నుంచి దేశం సురక్షితంగా ఉండేందుకు సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉండి సేవలందిస్తున్నారన్నారు. ఈద్‌, దీపావళి వంటి అనేక పండుగలు ఈ ఏడాదిలో జరుగాయని, ఆయా సమయాల్లో సరిహద్దులో నిలబడిన మన ధైర్య సాహసాలు గల సైనికులను కూడా స్మరించాలన్నారు.

ఈ ధైర్యవంతులైన కొడుకులు, కూతుళ్ల గౌరవార్థం మనం ఇంట్లో దీపం వెలిగించాలని మోదీ అన్నారు. చైనాతో నెలకొన్న వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. లడఖ్‌లో ఉద్రిక్తత ఏమాత్రం తగ్గకపోవడంతో సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ సెక్టార్లు సహా దాదాపు 3500 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంట చైనా బలగాలు, ఆయుధాలను గణనీయంగా బలోపేతం చేసుకుంటున్నది. ఇరుదేశాల సైనికుల మధ్య పలు దశల్లో ఉన్నతస్థాయి చర్చలు జరిగినా అందులో కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండుదేశాల మధ్య సంబంధాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.  

వోకల్‌ ఫర్‌ లోకల్‌

ఇంకా ప్రధాని మాట్లాడుతూ ప్రజలు సంయమనంతో పండుగలు జరుపుకోవాలని, షాపింగ్‌ చేసే సమయంలో ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ నినాదాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. అలాగే విజయ దశమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో సంయమనంతో, నిరాడంబరంగా పండుగలను జరుపుకుంటున్నారన్నారు. ‘యుద్ధంలో మేం (కొవిడ్‌-19 వ్యతిరేకంగా) పోరాడుతున్నాం.. విజయం ఖచ్చితంగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ‘గతంలో దుర్గాదేవి దర్శనం కోసం మండపాల్లో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడే వారు.

కానీ. ఈ సారి అలా జరుగలేదు. అంతకు ముందు దసరా నాడు పెద్ద జాతరలు కూడా జరిగేవి. ఈ సారి వాటి రూపం కూడా మరిపోయిందన్నారు. రామ్ లీలా పండుగ కూడా ఒక పెద్ద ఆకర్షణ. కానీ దానికి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. ఈసారి పెద్ద ఎత్తున సభలు నిషేధించారు. రాబోయే రోజుల్లో ఈద్, శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి, దీపావళి, ఛఠ్‌పూజ, గురునానక్‌ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో మేం సంయమనంతో పని చేయాల్సి ఉంది’ మక్‌ కీ బాత్‌లో చెప్పుకొచ్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.