మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 00:51:39

తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు!

తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు!
  • ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. నివేదిక వచ్చాక ఈ అంశంపై అవసరమైతే ఆగమపండితులతో చర్చిస్తామని అన్నారు. ఆదివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో రోడ్డుపై వెళ్లే మోనో, ట్రామ్‌ రైలు తరహా వాటిని మాత్రమే పరిశీలిస్తున్నామని, తీగలతో నడిచే రైలు వంటివాటి జోలికి వెళ్లడంలేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రియాలో ఎత్తయిన కొండపైకి మోనో రైలు వెళ్తున్నదని, దానిని మోడల్‌గా తీసుకొని తిరుమలకు రైలు ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ పేరుతో ట్విటర్‌లో జరుగుతున్న ప్రచారాన్ని సుబ్బారెడ్డి ఖండించారు. టీటీడీకి చెందిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నామంటూ అజిత్‌ ధోవల్‌ పేరుతో ప్రచారం జరుగుతున్నదని, అది అజిత్‌ ధోవల్‌ ట్విట్టర్‌ ఖాతాయే కాదని అన్నారు. అది నకిలీ ఖాతాగా టీటీడీ అధికారుల పరిశీలనలో తేలిందని చెప్పారు. దుష్ప్రచారం చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని వివరించారు. ఇలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు పెడుతామని హెచ్చరించారు. తిరుమలలో త్వరలోనే సైబర్‌ క్రైం విభాగాన్ని ఏర్పాటుచేయనున్నట్టు ఆయన చెప్పారు.logo