ఆదివారం 05 జూలై 2020
National - Jul 01, 2020 , 02:44:29

టీవీ, ఏసీలకు లైసెన్సింగ్

టీవీ, ఏసీలకు లైసెన్సింగ్

‌ న్యూఢిల్లీ, జూన్‌ 30: దేశంలోకి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రానిక్‌ వస్తువులకు చెక్‌పెట్టేందుకు కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఏసీలు, టీవీలతోపాటు 10నుంచి 12 వస్తువుల దిగుమతికి లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపట్టే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించటంతోపాటు చైనాను ఆర్థికంగా దెబ్బతీయటానికి ఈ లైసెన్సింగ్‌ విధానం అవసరమని పేర్కొన్నాయి. 


ఇప్పటికే మొదలైన లైసెన్సింగ్‌

భారత్‌ స్వేచ్ఛా వ్యాపార విధానంలోకి ప్రవేశించిన తర్వాత చాలా వస్తువుల ఎగుమతి దిగుమతికి ప్రత్యేకంగా లైసెన్సులు అవసరం లేకుండా పోయాయి. దాంతో చైనా నుంచి భారత్‌లోకి ఆట వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు భారీ ఎత్తున దిగుమతి అవుతున్నాయి. వీటివల్ల మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి తీవ్ర విఘాతం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో అత్యధికంగా దిగుమతి అయ్యే పలు వస్తువులకు లైసెన్సింగ్‌ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం కొద్ది నెలల క్రితమే ప్రారంభమైంది. అగర్‌బత్తీలు, టైర్లు, పామాయిల్‌ వంటి వస్తువుల దిగుమతికి లైసెన్సింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నది. 

ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్‌ వస్తువులపై కస్టమ్స్‌ పన్ను పెంచటం, నూతన సాంకేతిక ప్రమాణాలను నిర్ణయించటం ద్వారా దిగుమతులను నిరుత్సాహపరుస్తారు. టీవీలు, ఏసీలతోపాటు లైసెన్సింగ్‌ జాబితాలోకి తీసుకొచ్చే వస్తువుల జాబితాను కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ ఇప్పటికే రూపొందించినట్టు సమాచారం. అందులో స్టీల్‌, అల్యూమినియం, ఫుట్‌వేర్‌, ఆలుగడ్డలు, నారింజలు, లిథియం ఆయాన్‌ బ్యాటరీలు, యాంటీబయోటిక్స్‌, పెట్రోకెమికల్స్‌, వాహన, మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు, ఆటబొమ్మలు, క్రీడా పరికరాలు, సోలార్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు ఉన్నాయి. 


logo