చాలామంది ఫేస్ బుక్ అంటేనే టైమ్ వేస్ట్ అంటారు. ఎందుకంటే.. నేటి యువత ఎక్కువగా ఫేస్ బుక్ లోనే కదా టైమ్ పాస్ చేసేది. నిజానికి ఫేస్ బుక్ లో అవసరం ఉన్నది, అవసరం లేనిది.. అంతా ఉంటుంది. మనకు అవసరం ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటే.. ఫేస్ బుక్కే మనకు ఒక గురువు. కానీ.. చాలామంది అనవసరమైన విషయాలను ఫేస్ బుక్ లో వెతుకుతూ టైమ్ వేస్ట్ చేస్తుంటారు. కానీ.. గణేశ్ కులకర్ణి అనే వ్యక్తి మాత్రం ఫేస్ బుక్ ను మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
గణేశ్ కులకర్ణిది మహారాష్ట్రలోని ఔరంగాబాద్. అక్కడే లైబ్రేరియన్ గా పనిచేసేవాడు. కానీ.. ఆయనకు గార్డెనింగ్ అంటే పిచ్చి. అందుకే.. ఎప్పుడూ మొక్కల గురించి.. గార్డెనింగ్ ఎలా చేయాలి.. అనే దాని మీదనే ధ్యాస పెట్టేవాడు. కొన్ని మొక్కలను తన ఇంట్లో తెచ్చి నాటేవాడు. కానీ.. అవి కొన్ని రోజులకే చనిపోయేవి. ఒకసారి గులాబీ చెట్టు కూడా చనిపోయింది. దీంతో అసలు.. గార్డెనింగ్ ఎలా చేయాలి? మొక్కలను ఎలా పెంచాలి? అనే దానిపై ఇంటర్నెట్ లో వెతకసాగాడు. చివరకు ఫేస్ బుక్ లో గార్డెనింగ్ కు సంబంధించిన మెళకువలను నేర్చుకున్నాడు. వెంటనే తన ఇంటి మీద గార్డెనింగ్ చేయడం ప్రారంభించాడు.
అర్బన్ గార్డెనింగ్ కు సంబంధించిన అన్ని విషయాలను ఫేస్ బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. తన ఇంటి మీద అన్ని రకాల పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, పువ్వుల మొక్కలను పెంచడం ప్రారంభించాడు. కరోనా సమయంలో గణేశ్ కొత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా తన ఇంటి మీద మొక్కలు పెంచడం ప్రారంభించాడు. అలా.. ప్రస్తుతం తన ఇంటి మీద 200 రకాల కూరగాయలు, పండ్లు, పువ్వుల చెట్లను పెంచుతూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్థానికంగా ఉన్నవాళ్లు ఇప్పుడు ఆయన అర్బన్ గార్డెనింగ్ ను చూసి ముచ్చటపడుతున్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా.. బయట కాలు పెట్టకుండా.. తమకు కావాల్సిన పండ్లు, కూరగాయలు అన్నీ తానే పండించడంతో పాటు.. మార్కెట్ లో అమ్మి డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు.
ముందు ఏదో సరదాగా గార్డెనింగ్ ప్రారంభించా కానీ.. తర్వాత అదే నాకు ఒక వ్యసనం అయిపోయింది. రోజూ మొక్కలను చూడనిదే నిద్ర పట్టదు. మొక్కలకు కావాల్సిన నీళ్లు పోయడం, కంపోస్ట్ ఎరువు తయారు చేయడం, మొక్కలకు ప్రూనింగ్ చేయడం.. ఇలా రోజూ ఏదో ఒక పని చేయాల్సిందే. ఒకప్పుడు నేనే సోషల్ మీడియాలో గార్డెనింగ్ నేర్చుకున్నా. ఇప్పుడు నేను వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి.. పది మందికి అర్బన్ గార్డెనింగ్ గురించి అవగాహన కల్పిస్తున్నా.. అంటూ చెప్పుకొచ్చాడు గణేశ్.