బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 10:03:50

యువతను ప్రపంచ పౌరులుగా తీర్చిద్దుతాం : ప్రధాని నరేంద్ర మోదీ

యువతను ప్రపంచ పౌరులుగా తీర్చిద్దుతాం : ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : భారతీయ మధ్య తరగతి కుటుంబం దేశానికి ఎంతో మంది వృత్తి నిపుణులను అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండా ఎగుర వేసి అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. స్వయం సమృద్ధ భారత్‌ సాధించాలంటే విద్యా విధానం అత్యంత ప్రధానమైందని, నూతన విద్యా విధానంతో యువతను  ప్రపంచ పౌరులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన విధానంలో జాతీయ పరిశోధన నిధి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశం ముందుకు సాగేందుకు నూతన ఆవిష్కరణలు అవసరమని, నవ కల్పనలు నిరంతరం సాగాలన్నారు. 

దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు

స్వర్ణ చతుర్భుజి దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైలు, విమానాలు, నౌకాశ్రయాల అభివృద్ధి, అనుసంధానం ప్రారంభించామని, నూతన అనుసంధానం వ్యాపార, వాణిజ్యాన్ని ద్విగుణీకృతం చేస్తుందని చెప్పారు. దేశంలో మౌలిక వసతుల రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు రూ.100 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని,  దీనికి నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కింద మౌలిక వసతుల రంగంలో రూ.100 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. దీని కింద చేపట్టనున్న పలు రంగాలకు చెందిన దాదాపు 7వేల ప్రాజెక్టులను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. మౌలిక రంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వనున్న 110 జిల్లాలను గుర్తించామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని పోర్ట్‌లను అనుసంధానిస్తూ 4 మార్గాల రోడ్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. గడిచిన ఆరేళ్లలో సామాన్యుల జీవన ప్రమాణాల మెరుగునకు అనేక పథకాలు తెచ్చామన్నారు. బ్యాంకు ఖాతాలు, రేషన్‌పంపిణీ, నగదు బదిలీ చేపట్టామని, ఒకే కార్డు ఒకే దేశం వంటి పథకాలు తీసుకువచ్చామని తెలిపారు. కృష్టకాలంలో ప్రతి ఇంటికి ఆహార ధాన్యాలు చేరాయని, ఉచిత గ్యాస్‌, ఆహార ధాన్యాల పంపిణీ 80 కోట్ల మంది ఆకలిని దూరం చేశాయని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల వృద్ధి.. కొత్త ఉపాధిని సృష్టించిందని, పట్టణాల్లో చిరు, వీధి వ్యాపారులకు రుణాల ద్వారా అస్థిత్వాన్ని అందించినట్లు గుర్తు చేశారు. 

వెనుకబడి జిల్లాల అభివృద్ధి నూతన పథకాలు

దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించినట్లు మోదీ తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కోసం నూతన పథకాలు ప్రారంభించామన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి కొత్త పథకాలు తెచ్చామని, వ్యవసాయ మార్కెటింగ్‌రంగంలో నూతన శకానికి నాంది పలికామన్నారు. ప్రభుత్వ బంధనాల నుంచి రైతులను విముక్తి చేస్తున్నామని, రైతుల ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం అందిస్తామని, రైతులే స్వయం ఆహార శుద్ధికి ముందుకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, విలువ జోడింపునకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛమైన తాగునీటితో సగం ఆరోగ్య సమస్యలకు సమాధానం వచ్చని, దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన తాగునీటి కోసం నిరంతరం ప్రయత్నం సాగుతోందన్నారు. జలజీవన్‌మిషన్‌తో ఆరోగ్య రంగంలో గొప్ప మార్పు వస్తుంది ప్రధాని అన్నారు. జల జీవన్ మిషన్‌తో సామాన్య ప్రజలు అనారోగ్యం నుంచి బయటపడుతున్నారని, తాగునీరు అందించేందుకు కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై పని చేస్తున్నాయని స్పష్టం చేశారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo