సోమవారం 26 అక్టోబర్ 2020
National - Aug 10, 2020 , 18:22:45

రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల గృహాలకు శంకుస్థాపన

రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల గృహాలకు శంకుస్థాపన

న్యూఢిల్లీ : రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల కోసం 40 నివాస గృహాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆన్‌లైన్ వేదిక ద్వారా సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని ఆర్కే పురం సెక్టార్-12లో రూ.46 కోట్ల ఖర్చుతో ఈ నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. 

2003లోనే ఈ స్థలాన్ని కేటాయించినప్పటికీ వివిధ అడ్డంకుల కారణంగా ఆలస్యం జరిగిందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల నివాస గృహాల విషయంలో తీవ్ర కొరత ఉందన్న ఆయన.. రెండేండ్లుగా ఈ అంశం మీద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పురి సహా సంబంధిత ఉన్నతాధికారులతో విస్తృత సమావేశాల తర్వాత ఈ అంశం కొలిక్కి వచ్చిందని తెలిపారు. టైప్ -3, టైప్ -4 క్వార్టర్ల కొరత తీవ్రంగా ఉన్నదన్న ఉపరాష్ట్రపతి.. ఆర్కేపురం నిర్మాణ సముదాయంలో మొదటి దశలోనే ఈ తరహాకు చెందిన 32 క్వార్టర్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 

రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల నివాస గృహాల కొరత తీర్చేందుకు మూడేండ్లలో ఈ నివాస సముదాయ నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి  హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ గృహసముదాయ నిర్మాణం కోసం వెంకయ్య నాయుడు తీసుకున్న చొరవ, చేపట్టిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ కారణంగానే సమస్యలు చాలా వరకూ తొలగి ఇవాళ ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ నివాస గృహాలు అందించాలన్న లక్ష్యంతో  2016లో ప్రారంభించిన హౌసింగ్ ఫర్ ఆల్ మిషన్ కింద ఇప్పటికే 1.07 కోట్ల నివాస గృహాల మంజూరు జరిగిందని, ఇప్పటికే లక్ష ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించామని, మరో 65 లక్షల ఇండ్లు నిర్మాణం దశలో ఉన్నాయని చెప్పారు. మొత్తం 1.12 కోట్ల నివాస గృహా మంజూరు లక్ష్యాన్ని 2022 కంటే ముందుగానే చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ, కార్యదర్శి డాక్టర్ పీపీకే రామాచార్యులు, ఎన్బీసీసీ సీఎండీ పీకే గుప్తా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, రాజ్యసభ సచివాలయ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


logo