ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 14:54:01

లవ్ జిహాద్‌పై చట్టం తీసుకురానున్న మధ్యప్రదేశ్‌

లవ్ జిహాద్‌పై చట్టం తీసుకురానున్న మధ్యప్రదేశ్‌

భోపాల్‌  : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లవ్ జిహాద్ చట్టం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. లవ్‌ జిహాద్‌ కేసులను నిలువరించాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు. మంగళవారం ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా దీనిపై ఒక ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పెరిగిపోతున్న లవ్ జిహాద్ కేసులను ఆపడానికి తమ ప్రభుత్వం చట్టం తీసుకువస్తుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం స్వేచ్ఛా మత చట్టాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో బిల్లు తీసుకువస్తామన్నారు. చట్టం తీసుకువచ్చిన తరువాత లవ్‌ జిహాద్‌కు పాల్పడేవారు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేస్తారని, 5 సంవత్సరాల కఠిన శిక్ష ఇస్తారని ఆయన తెలిపారు. 

లవ్ జిహాద్ చట్టం గురించి నరోత్తం మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు. కొత్త చట్టం కింద ఈ కేసుల్లో సహకరించే వారిని కూడా ప్రధాన నిందితులుగా చేస్తామని చెప్పారు. వారిని నేరస్థులుగా తీసుకుంటే ప్రధాన నిందితుల మాదిరిగానే శిక్ష అనుభవిస్తారని, అదే సమయంలో, వివాహం కోసం మతమార్పిడి చేసేవారిని శిక్షించే నిబంధనలు కూడా చట్టంలో ఉంటాయన్నారు. స్వచ్ఛంద మత మార్పిడికి నెల రోజుల ముందుగా అధికారులకు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని, అనేక సందర్భాల్లో మహిళలు స్వచ్ఛందంగా మతం మారాలని, వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారన్నారు. అలాంటి కేసుల దృష్ట్యా, ఎవరైనా స్వచ్ఛందంగా వివాహం కోసం మతం మారాలనుకుంటే వారు నెల ముందుగానే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన కూడా ఈ చట్టంలో ఉంటుందని వెల్లడించారు. మతం మార్చడం ద్వారా వివాహం చేసుకోవడానికి కలెక్టర్ ఈ దరఖాస్తును సమర్పించడం తప్పనిసరి అని, దరఖాస్తు లేకుండా మార్పిడి జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.