గురువారం 02 జూలై 2020
National - Jun 23, 2020 , 16:43:53

క‌రోనా బాధితులు.. పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు

క‌రోనా బాధితులు.. పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు

న్యూఢిల్లీ : క‌రోనా పాజిటివ్ బాధితుల‌కు ఆయా ఎన్నిక‌ల్లో ఓటేసేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్ర‌త్యేక వెసులుబాటు క‌ల్పించింది. క‌రోనా బాధితులంద‌రూ పోస్ట‌ల్ బ్యాలెట్ ఉప‌యోగించి ఓటు వేయొచ్చ‌ని తెలిపింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నారు. 

క‌రోనాతో బాధ‌ప‌డుతున్న వారు పోస్ట‌ల్ బ్యాలెట్ ఉప‌యోగించేందుకు అనుమ‌తించేలా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ‌లోని శాస‌న విభాగం ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను మార్చిన‌ట్లు.. ఆ శాఖ ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు.  కొవిడ్ బాధితులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి ప్ర‌త్యేక వెసులుబాటు క‌ల్పించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇటీవ‌ల కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ‌ను సంప్ర‌దించింది. ఈ నేప‌థ్యంలో దీనిపై చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకున్నారు. 

80 ఏళ్లు పైబ‌డిన వారికి, విక‌లాంగుల‌కు, ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే వారికి మాత్ర‌మే పోస్ట‌ల్ బ్యాలెట్ కు అనుమ‌తించేవారు. ఈ జాబితాలో ఇప్పుడు కొవిడ్ బాధితుల‌ను కూడా చేర్చామ‌ని ఆ ఉన్న‌తాధికారి పేర్కొన్నారు.   

భార‌త్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిన త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బ‌డుతున్న తొలి రాష్ర్టం బీహార్.  వైర‌స్ మ‌హ‌మ్మారి ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు విజృంభించే అవ‌కాశం ఉన్నందున‌.. బీహార్ ఎన్నిక‌ల్లో కొవిడ్ బాధితుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. 

 బీహార్‌లో దాదాపు 7.20 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 243 మంది సభ్యుల అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 29 తో ముగుస్తుంది. నవంబర్ 29 లోపు కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాలి.


logo