ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 19:55:58

గోవధ వ్యతిరేక చట్టం దుర్వినియోగమవుతున్నది: కోర్టు

గోవధ వ్యతిరేక చట్టం దుర్వినియోగమవుతున్నది: కోర్టు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గోవధ వ్యతిరేక చట్టం దుర్వినియోగమవుతున్నదని అలహాబాద్‌ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం కింద అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని విమర్శించింది.  చాలా కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాంసాన్ని పరీక్షించకుండానే ఆవు మాంసంగా పేర్కొంటున్నారని మండిపడింది. ‘సాధారణంగా ఏదైనా మాంసాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడల్లా, దీనిని ఫోరెన్సిక్ లాబొరేటరీ పరిశీలించడం లేదా విశ్లేషించకుండా ఆవు మాంసం (గొడ్డు మాంసం) గా చూపిస్తారు. చాలా సందర్భాలలో, ఆ మాంసం ఏ జంతువుది అన్నది నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపడం లేదు. దీంతో గోవధకు పాల్పడని వ్యక్తులు నిందితులుగా జైళ్లలో ఉంటున్నారు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. 

రహామ్‌, అలియాస్ రహ్ముద్దీన్ బెయిల్ దరఖాస్తుపై సోమవారం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పాలు ఇవ్వని, ముసలి ఆవులను గోశాలలు అంగీకరించడం లేదని, దీంతో వాటిని పెంచేవారు వీధుల్లో వదిలేస్తున్నారని, అనంతరం అవి ఎక్కడికి చేరుతున్నాయన్నది ఎవరికీ తెలియడం లేదని కోర్టు పేర్కొంది. ఆవును వధించినట్లుగా ఆరోపించిన నిందితుడ్ని నేరం జరిగిన స్థలంలో అరెస్ట్‌ చేయలేదని గుర్తుచేసింది. ఎఫ్‌ఐఆర్‌లో సంబంధిత అభియోగాలు లేవని, నిందితుడుగా చెబుతున్న వ్యక్తి ఆగస్టు 5 నుంచి జైల్లో ఉంటున్నాడని తెలిపింది. ఈ నేపథ్యంలో రహామ్‌, అలియాస్ రహ్ముద్దీన్‌కు అలహాబాద్‌ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు