గురువారం 26 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 02:35:31

7న ‘ఈవోఎస్‌-01’ ప్రయోగం

7న ‘ఈవోఎస్‌-01’ ప్రయోగం

  • విపత్తు నిర్వహణ, అటవీ భూములపై నిఘాకు సాయం

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ఉపగ్రహాన్ని వచ్చే నెల 7న ప్రయోగించనున్నది. పీఎస్‌ఎల్వీ-సీ49 వాహక నౌక ద్వారా ఈవోఎస్‌-01 భూ పరిశీలన నిఘా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నది. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించింది. ఈవోఎస్‌-01తో పాటు మరో తొమ్మిది అంతర్జాతీయ వాణిజ్య ఉపగ్రహాలను కూడా ప్రయోగించనున్నట్టు తెలిపింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే, నవంబర్‌ 7న మధ్యాహ్నం 3.02 గంటలకు రాకెట్‌ను ప్రయోగిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు. ఈవోఎస్‌-01 ప్రయోగం విజయవంతమైతే విపత్తు నిర్వహణ, వ్యవసాయ, అటవీ భూములపై నిఘా, పరిశీలన మరింత సులభతరమవుతుందని వివరించారు. కాగా కరోనా వ్యాప్తి దృష్ట్యా దేశంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఇస్రో ఈ ఏడాది తలపెట్టిన పలు ఉపగ్రహ ప్రయోగాలు వాయిదా పడ్డాయి. 

ప్రయోగం పేరు: పీఎస్‌ఎల్వీ-సీ49

ఉపగ్రహాల సంఖ్య: 10 (దేశీయ 1, విదేశీ 9)

ఎప్పుడు: నవంబర్‌ 7, మధ్యాహ్నం 3.02 గంటలు

లాభాలు: విపత్తు నిర్వహణ, వ్యవసాయ, అటవీ భూములపై నిఘా పరిశీలన