తడిసిన ధాన్యం కుప్పలు
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు
కోతదశలో రాలిన మామిడి కాయలు
డిచ్పల్లి, మే 1: డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో శనివారం కురిసిన ఈదురు గాలులు, భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు, మామిడి చెట్లు నేలకొరిగాయి. ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయని సర్పంచ్ రూప తెలిపారు. రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని ఖిల్లా డిచ్పల్లి, మెంట్రాజ్‌పల్లి, బర్ధిపూర్, రాంపూర్, సహకార సంఘాల పరిధిలోని గ్రామాల్లో రైతులు రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. ఈదురు గాలులకు మండలంలోని ఖిల్లా డిచ్పల్లి రామాలయం ఎదుట ఉన్న కల్యాణ మండపం ముం దు భాగం రేకుల షెడ్డు కుప్పకూలింది. భారీగా వీచిన ఈదురు గాలులకు ముందర భాగంలో ఉన్న రెండు పిల్లర్లు నేలకొరగడంతో మండపం ముందర రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
ధర్పల్లిలో..
ధర్పల్లి, మే 1: మండలంలో అకాల వర్షం కురవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోకుండా కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు.
ఇందల్వాయిలో..
ఇందల్వాయి, మే 01: మండలంలోని గన్నారం, చంద్రయాన్‌పల్లి, తిర్మన్‌పల్లి, గంగారాం నాయక్ తండా, వెంగల్పాడ్, నల్లవెల్లి, సిర్నపల్లి, ఎల్లారెడ్డిపల్లి, లోలం, మల్లాపూర్ గ్రామాల్లో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి కుప్పలు పోసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురు గాలులతో మామిడి కాయాలు నేలరాలాయి.
చందూర్‌లో..
చందూర్ , మే 1 : చందూర్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు తడవకుండా పట్టాలు కప్పి జాగ్రత్త పడ్డారు.
బోధన్‌లో..
శక్కర్‌నగర్, మే 1: బోధన్ మున్సిపల్ పరిధిలోని చెక్కిక్యాంప్ శివపంచాయతన సహిత హనుమాన్ మందిరం ఎదుట ఉన్న ధ్వజస్తంభం గాలికి పడిపోయింది. ఎడపల్లి మండలంలో సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు, ఈదురు గాలులు వీచాయి.
రెంజల్ మండలంలో..
రెంజల్, మే 1 : రెంజల్ మండలంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
తడిసిన ధ్యానం..
మాక్లూర్, మే 1: మాక్లూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురిసిన వర్షంతో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒకేసారి వర్షం రావడంతో పంట నీటిపాలు అయ్యిందని వారు వాపోయారు.
ఆర్మూర్‌లో..
ఆర్మూర్, మే 1: ఆర్మూర్ మున్సిపల్, మండలంలోని అన్ని గ్రామాల్లో ఈదురుగాలుతో కలిగిన అకాల వర్షం కురిసింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నువ్వుల పంటకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.