శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - May 28, 2020 , 03:29:59

హద్దు మీరుతున్న చైనా!

హద్దు మీరుతున్న చైనా!

  • ఆక్సాయ్‌చిన్‌లో సైనిక కదలికలు
  • శాటిలైట్‌ చిత్రాలతో వెలుగులోకి..
  • భద్రతా సవాళ్లపై భారత ఆర్మీ టాప్‌ కమాండర్లు సమీక్ష

న్యూఢిల్లీ, మే 27: భారత్‌తో చైనా కయ్యానికి కాలు దువ్వుతున్నది. సరిహద్దుల్లో హద్దుమీరుతున్నది. యుద్ధ సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తమ సైన్యానికి ఆదేశించిన మరుసటి రోజే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతం లో వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న రోడ్డు వెంబడి పెద్ద ఎత్తున చైనా సైనిక కదలికలకు సంబంధించిన శాటిలైట్‌ ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ నెల మూడోవారానికి సంబంధించిన ఈ ఫొటోలను యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ విడుదల చేసింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే, 30-50 మీటర్ల పొడవున్న వాహనాలు సంచరిస్తున్నట్లు కనిపిస్తున్నది. బలగాలను లేదా సైనిక సామగ్రిని వీటి ద్వారా తరలిస్తుండవచ్చని భావిస్తున్నారు.  

ట్రంప్‌ నోట మళ్లీ మధ్యవర్తిత్వం మాట

సరిహద్దు విషయంలో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇప్పటికే ఈ విషయాన్ని రెండు దేశాలకు తెలియజేసినట్లు బుధవారం ట్వీట్‌చేశారు. గతంలో కశ్మీర్‌ విషయంలోనూ భారత్‌, పాక్‌ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్‌ ముందుకొచ్చారు. అయితే దీన్ని భారత్‌ వ్యతిరేకించింది. మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది. 

టాప్‌ కమాండర్లు సమావేశం..

తూర్పు లడఖ్‌లో భారత్‌, చైనా బలగాల మధ్య ఘర్షణతోపాటు దేశం ఎదుర్కొంటున్న  భద్రతా సవాళ్లపై ఆర్మీ టాప్‌ కమాండర్లు సమీక్ష నిర్వహిస్తున్నారు. సైన్యాధిపతి జనరల్‌ నరవణే నేతృత్వంలో మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. తూర్పు లడఖ్‌లో పరిస్థితులపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నారు. 

కరోనాపై పోరులో నిమగ్నమైన వేళ..

ప్రపంచమంతా కరోనాపై పోరులో నిమగ్నమైన నేపథ్యంలో.. ఇదే అదునుగా చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు యత్నిస్తున్నది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో పట్టు పెంచుకునేందుకు సిద్ధమవుతున్నది. హాంకాంగ్‌పై దూకుడు పెంచింది. భారత్‌ సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతున్నది. 

సరిహద్దుల్లో పరిస్థితులు నయంత్రణలోనే: చైనా

భారత్‌ సరిహద్దుల్లో పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని చైనా వ్యాఖ్యానించింది. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలకు తగిన యంత్రాంగం, సమాచార వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజన్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దు సమస్యలపై చైనా వైఖరి స్పష్టంగా ఉన్నదని చెప్పారు. ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకే తాము నడుచుకుంటున్నామని పేర్కొ న్నారు.